Michaung Cyclone Effect : భయానకంగా మారిన మిచాంగ్ తుపాన్.. ఏపీలో తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

ఏపీ ప్రభుత్వం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్షించారు.

Michaung Cyclone Effect

Michaung Cyclone : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచాంగ్ తుపాను తీవ్రరూపం దాల్చింది. ఏపీవైపు దూసుకొస్తుంది. మచిలీపట్నానికి 170 కిలో మీటర్లు, కావలికి 25 కిలో మీటర్లు దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇవాళ మధ్యాహ్నం నెల్లూరు – బాపట్ల మధ్య తుపాను తీరందాటే అవకాశం ఉంది. తీరందాటే సమయంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 90-110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. కృష్ణా జిల్లా పాలకాయ తిప్పసాగర సంగమంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 200 మీటర్లపైబడి అక్కడ సముద్రం ముందుకొచ్చింది. మరోవైపు మచిలిపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో పదో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ పోర్టుకు తొమ్మిదో నెంబర్ ప్రమాద హెచ్చరిక, మిగిలిన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : Michaung Cyclone : చెన్నైలో జలప్రళయం .. 2015లో వరదల కంటే దారుణం.. 47ఏళ్లలో ఇదే తొలిసారి

మిచాన్ తుపాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అక్కడి ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు సముద్ర తీర ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు మిచాంగ్ తుపాను కారణంగా గూడూరు – రేణిగుంట, రేణిగుంట – గూడూరు, తిరుపతి – పుల్ల రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. హౌరా కన్యాకుమారి రైలు దారి మళ్లించారు. తుపాను కారణంగా హైదరాబాద్ నుంచి దక్షిణాదికి వెళ్లే రైళ్లు, ఉత్తరాది నుంచి వచ్చే రైళ్లకు బ్రేక్ పడింది. ఇప్పటికే 150కిపైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

Also Read : Cyclone Michaung : తరుముకొస్తున్న తుపాను.. సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు

మిచాంగ్ తుపాను తీవ్రరూపం దాల్చడంతో ఏపీలోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. మరోవైపు నెల్లూరు, కడప, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం, విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్షించారు. జిల్లాల కలెక్టర్లు, అధికారులకు జగన్ దిశానిర్దేశం చేశారు. బాపట్ల, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తుపాను ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు