Michaung Cyclone : చెన్నైలో జలప్రళయం .. 2015లో వరదల కంటే దారుణం.. 47ఏళ్లలో ఇదే తొలిసారి

మిచాంగ్ తుపాను ప్రభావం తమిళనాడు రాజధాని చెన్నైపై తీవ్రంగా ఉంది. తాజా వర్ష బీభత్సం కారణంగా చెన్నై నగరంలో గత 47ఏళ్లలో అత్యంత భారీ వర్షంగా నమోదైంది.

Michaung Cyclone : చెన్నైలో జలప్రళయం .. 2015లో వరదల కంటే దారుణం.. 47ఏళ్లలో ఇదే తొలిసారి

Michaung Cyclone chennai

Michaung Cyclone Effect: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మిచాంగ్ తుపానుగా మారింది. మరికొద్ది గంటల్లో తీరం దాటే అవకాశం ఉంది. మిచాంగ్ తుపాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురిసింది. సోమవారం మధ్యాహ్నానికే చెన్నై, శివారు జిల్లాల్లో 35 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. దీంతో ఆ ప్రాంతాల్లో వీధులన్నీ వాగులుగా మారాయి. నగరంలో ఎటు చూసినా వరద పోటెత్తింది. ఇళ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి.

Also Read : Today Headlines : దూసుకొస్తున్న మిచాంగ్‌ తుపాను.. నీటమునిగిన తిరుపతి, నెల్లూరు

భారీ వర్షాల కారణంగా చెన్నైలోని దివంగత సీఎం జయలలిత నివాసం, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి ప్రముఖులుండే పోయెస్ గార్డెన్ హైవే 7 అడుగుల మేర కుంగింది. మంగళవారం ఉదయంసైతం భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా చెన్నై శివారులోని జాతీయ రహదారి వరద నీటిలో మునగడంతో రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. మంగళవారం ఉదయం వరకు విమానాశ్రయాన్ని మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే, మంగళవారం ఉదయం వరకు కూడా అక్కడ వర్షపు నీరు నిలిచి ఉంది. భారీ వర్షాల కారణంగా 160 మిమాన సేవలు రద్దయ్యాయి. మరో 33 సర్వీసులు బెంగళూరుకు దారి మళ్లించారు. కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్ట జిల్లాలోనూ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది.

Also Read : Cyclone Michaung : తరుముకొస్తున్న తుపాను.. సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు

మిచాంగ్ తుపాను ప్రభావం తమిళనాడు రాజధాని చెన్నైపై తీవ్రంగా ఉంది. తాజా వర్ష బీభత్సం కారణంగా చెన్నై నగరంలో గత 47ఏళ్లలో అత్యంత భారీ వర్షంగా నమోదైంది. 2015 సంవత్సరంలో చెన్నైలో కుంభవృష్టి కురిసింది. అప్పట్లో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రస్తుతం మిచాంగ్ తుపాను వల్ల అంతకుమించి వర్షపాతం నమోదైంది. 2015లో చెన్నై వరద నగరాన్ని ముంచెత్తినప్పుడు 330 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం ఆదివారం ఉదయం నుంచి 400 నుంచి 500 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అప్పటి కష్టాలు పునరావృతం కాకుండా చేసేందుకు డీఎంకే ప్రభుత్వం నగరంలోని రూ.4వేల కోట్లతో నిర్మించిన వరద కాల్వలు పూర్తిగా వాడకంలోకి రాకపోవటంతో ఈసారీ ముంపు సమస్య తలెత్తింది. ఇక్కడ మంగళవారంసైతం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.