Nara Lokesh
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలకు ప్రతిపాదనలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. శాసనసభలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో కేటాయించిన నిధుల మేరకు ప్రతి మున్సిపాలిటీకి ఒక సెంటర్ చొప్పున మరో 125 కొత్త సెంటర్లను ప్రతిపాదించామని తెలిపారు.
నూరు శాతం మంజూరవుతాయని బలంగా నమ్ముతున్నామని నారా లోకేశ్ అన్నారు. పిల్లలను, వారి కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. సభ్యులతో ఒక కమిటీ వేసి కొత్త టెక్నాలజీ, టీచింగ్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
స్పెషల్ నీడ్స్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు అవసరాలను ఆసరాగా తీసుకుని కొన్ని ప్రైవేటు సంస్థలు వారి నుంచి రూ.50 వేల చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నాయని నారా లోకేశ్ చెప్పారు. వీరి కోసం రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు నిర్వహిస్తున్నామని అన్నారు.
ప్రతి సెంటర్‌కు ఇద్దరు ఐఈఆర్‌పీల చొప్పున 1,358 మంది టీచర్లు ఉన్నారని నారా లోకేశ్ తెలిపారు. ఈ సెంటర్లలో 41,119 మంది రిజిస్టర్ చేసుకున్నారని అన్నారు. మరోవైపు, అసెంబ్లీలో అమరావతిపై సుజనాచౌదరి ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. 2028 నాటికి రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు. అందుకు రూ.64,721 కోట్లు వ్యయం అవుతుందని అన్నారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడేళ్లలో రైతులను అప్పగిస్తామని తెలిపారు.