Ap Capital Amaravati : మరో మూడేళ్లలో రాజధాని అమరావతి పనులు పూర్తి- మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

అసలు రాజధానే ఇక్కడ ఉండకూడదని గత పాలకులు ఏవేవో కుట్రలు చేశారు..

Ap Capital Amaravati : మరో మూడేళ్లలో రాజధాని నిర్మాణం పనులు పూర్తి అవుతాయని అన్నారు మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే అధారిటీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు. 23 అంశాలు అజెండాగా సమావేశం జరగ్గా.. అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కీలకమైన భవన, రోడ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి టెండర్లు పిలిచేలా సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో సీఆర్డీయే ఏడీసీ అధికారులతో పాటు మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.

గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో రాజధాని అభివృద్ధిపై తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని మంత్రి నారాయణ ఆరోపించారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన విధంగా మరో మూడేళ్లలో అమరావతి అభివృద్ధిని పూర్తి చేస్తామన్నారు. రోడ్ల అభివృద్ధి కోసం 11 వేల కోట్ల రూపాయలు, భవనాల నిర్మాణం కోసం 3వేల 521 కోట్ల రూపాయలతో నిర్మాణాలకు ఆమోదం లభించిందన్నారు. నమ్మకంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ రుణపడి ఉంటుందని మంత్రి నారాయణ చెప్పారు.

”గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అమరావతి రాజధానిని మళ్లీ అభివృద్ధి చేస్తాం. 2015 జనవరి 1న ల్యాండ్ పూలింగ్ కోసం ఒక చిన్న నోటిఫికేషన్ ఇస్తే.. కేవలం 58 రోజుల్లో 34వేల ఎకరాలను మా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నమ్మకంతో ఇచ్చారు. ఆ రోజు రైతులు ఎంతో నమ్మకంతో ఇచ్చారు. రాజధాని వస్తుంది, మా భూముల విలువ పెరుగుతుందని ఆశించారు. కానీ, గత వైసీపీ పాలనలో రైతులు ఎన్నో బాధలు పడ్డారు. ధర్నాలు చేశారు. దెబ్బలు తిన్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మహిళలను హింసించారు.

అసలు రాజధానే ఇక్కడ ఉండకూడదని గత పాలకులు ఏవేవో ప్రయత్నాలు చేశారు. అమరావతి అభివృద్ది చెందకూడదని గత ప్రభుత్వం కుట్రలు చేసింది. ఏది ఏమైనా.. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. 2014-19లో నాడు రైతులకు, 5 కోట్ల మంది ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో.. కచ్చితంగా నూటికి నూరు శాతం పూర్తి చేస్తాం. రాబోయే మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి అవుతాయి” అని మంత్రి నారాయణ తెలిపారు.

Also Read : డిస్ట్రిక్ రీఆర్గనైజేషన్‌పై ఏపీ సర్కార్ స్టెప్ ఏంటి? దూరంగా ఉన్న జిల్లా కేంద్రాలను మార్చబోతున్నారా?