డిస్ట్రిక్ రీఆర్గనైజేషన్‌పై ఏపీ సర్కార్ స్టెప్ ఏంటి? దూరంగా ఉన్న జిల్లా కేంద్రాలను మార్చబోతున్నారా?

కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు లేవని..ఆఫీసులు, కలెక్టరేట్ల కోసం స్థలాలు కొనాలంటే భారం అవుతుందని..అంతకంటే ముందు రీఆర్గనైజేషన్‌ ప్రాసేసే పెద్ద తలనొప్పి అంటున్నారు.

డిస్ట్రిక్ రీఆర్గనైజేషన్‌పై ఏపీ సర్కార్ స్టెప్ ఏంటి? దూరంగా ఉన్న జిల్లా కేంద్రాలను మార్చబోతున్నారా?

CM Chandrababu Naidu

Updated On : December 2, 2024 / 8:50 PM IST

భౌగోళిక పరిస్థితులు, పాలనా సౌలభ్యం..అధికార వికేంద్రీకరణ..ఇలా ఎన్నో అంశాల సెంట్రిక్‌గా ఏపీలో 13 జిల్లాలు 26 అయ్యాయి. కొత్త కష్టాలు మొదలయ్యాయి. అధికార వికేంద్రీకరణ జరుగుతుందని..ప్రజలకు అధికారులు ఈజీగా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుందని భావిస్తే..దిక్కుదివానం లేని పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాలది.

గత సర్కార్ హయాంలో అడ్డగోలుగా జిల్లాల విభజన జరిగినట్లు కూటమి పెద్దలు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రానికి మారుమూల గ్రామాలకు ఉన్న దూరం, పాలనా కేంద్రం, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఇవన్నీ ఎలా తోస్తే అలా చేసేశారట. రాజకీయ అవసరాలకు తగ్గట్లుగా మార్చేశారట. చాలా నియోజకవర్గాల్లో కొన్ని మండలాలను ఓ జిల్లాలో, మరికొన్ని మండలాలను ఇంకో జిల్లాలో కలిపేశారు.

పార్లమెంటు సెగ్మెంట్‌ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా విడదీశారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాలను వేర్వేరు జిల్లాల్లో కలిపేశారు. ప్రతీ లోక్‌సభ స్థానాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తానన్న మాటను కూడా జగన్‌ నిలబెట్టుకోలేదు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలను మరో జిల్లాలో కలిపారంటున్నారు కూటమి నేతలు.

సుదూర ప్రాంతాలను కలిపి జిల్లాగా ఏర్పాటు
ప్రజల సౌకర్యం గురించి ఆలోచించకుండా సుదూర ప్రాంతాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేశారు. రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌ నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు 245 కి.మీ. దూరంలో ఉంది. రంపచోడవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి దూరం 225 కిలోమీటర్లు. అంటే జిల్లా కేంద్రం కంటే రాష్ట్ర రాజధానే ఇంకో 20 కిలో మీటర్లు దగ్గరన్నమాట. ఇక శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గాన్ని రాజకీయ కోణంలో విజయనగరం జిల్లాలోకి తెచ్చారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు విజయవాడను ఆనుకుని ఉన్న పెనమలూరు, గన్నవరం మండలాలను తీసుకెళ్లి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణాజిల్లాలో కలిపారు.

కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు దూరాభారం తగ్గాలి. కానీ రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లలోని 11 మండలాల ప్రజలు తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడేరు కేంద్రంగా పాడేరుతో పాటు ఈ రెండు రెవెన్యూ డివిజన్లతో అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేశారు. రంపచోడవరం డివిజన్‌ నుంచి పాడేరు 245 కి.మీ. దూరంలో ఉంది.

పునర్విభజనకు ముందు జిల్లా కేంద్రం కాకినాడకు చేరుకోవాలంటే 80 నుంచి 180 కి.మీ. వెళ్తే సరిపోయేది. ఇప్పుడు పాడేరుకు వచ్చి వెళ్లాలంటే ఒకరోజు పడుతుంది. చింతూరు డివిజన్‌ వాసులదీ ఇదే పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాల పునర్విభజనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. చాలా జిల్లాలలో ఇదే పరిస్థితి. కొత్త జిల్లాల కేంద్రాలలో ఇప్పటికీ కార్యాలయాలు లేవు.

తప్పులను సరిదిద్దుతామని హామీ
అయితే నాడు జగన్‌ చేసిన తప్పులను సరిదిద్దుతామని ప్రతిపక్షనేతగా చంద్రబాబు పలు సభల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు జిల్లాల విభజన ద్వారా జగన్‌ తెచ్చిపెట్టిన కష్టాల నుంచి కూటమి ప్రభుత్వం విముక్తి కల్పిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. అయితే కూటమి సర్కార్ డిస్ట్రిక్ రీఆర్గనైజేషన్‌ మీద ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. పలు రెవెన్యూ డివిజన్లు, జిల్లాల సరిహద్దులు మార్చబోతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇప్పుడున్న పరిస్థితులు జిల్లా పునర్విభజన అనేది పెద్ద తలనొప్పిగా చెప్తున్నారు కొందరు అధికారులు. ఇప్పుడిప్పుడే కొత్త జిల్లాల్లో పాలన, అభివృద్ధి పరుగులు పెడుతుందని ఈ సమయంలో డిస్ట్రిక్ రీఆర్గనైజేషన్‌కు పూనుకుంటే..సమయంతో కూడుకున్న పని అంటున్నారు. ఆఫీసుల షిఫ్టింగ్‌తో పాటు..సెంటర్‌ పాయింట్‌గా జిల్లా కేంద్రాల ఏర్పాటు కూడా అంత ఈజీ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు లేవని..ఆఫీసులు, కలెక్టరేట్ల కోసం స్థలాలు కొనాలంటే భారం అవుతుందని..అంతకంటే ముందు రీఆర్గనైజేషన్‌ ప్రాసేసే పెద్ద తలనొప్పి అంటున్నారు. అయితే కూటమి పెద్దలు ఎన్నికల్లో ఇచ్చినా ఒక్కో మాటను నిలబెట్టుకుంటూ వస్తున్నారు. జిల్లాల పునర్విభజనపై అధికారుల అభిప్రాయాలు ఎలా ఉన్నా..చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం తప్పులను సరిదిద్దే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే కొంత టైమ్‌ తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అసెంబ్లీలో అప్పుల గురించి పదే పదే దుష్ప్రచారం చేశారు.. హామీలపై నోరెత్తలేదు: బొత్స