అసెంబ్లీలో అప్పుల గురించి పదే పదే దుష్ప్రచారం చేశారు.. హామీలపై నోరెత్తలేదు: బొత్స
జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈపాటికే అనేక సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేసేదని చెప్పుకొచ్చారు.

Botsa Satyanarayana
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతన లేకుండా ఉందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో బొత్స మీడియా సమావేశంలో మాట్లాడారు.
అసెంబ్లీలో అప్పుల గురించి పదే పదే దుష్ప్రచారం చేశారని, హామీలపై నోరెత్తలేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. రామకోటి తరహాలో ఎప్పుడూ జగన్.. జగన్.. అని స్తోత్రం చేస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టి విద్యుత్ ట్రూ అప్ చార్జీలను పెంచుతున్నారని తెలిపారు. రూ.15 వేల కోట్ల ట్రూ అప్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
చార్జీల వసూలును తక్షణమే రద్దు చేయాలని, వచ్చే నెల నుంచి విద్యుత్ బిల్లులు చూస్తే ప్రజలకు హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉందని బొత్స తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ట్రూ అప్ పేరిట సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈపాటికే అనేక సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేసేదని చెప్పుకొచ్చారు.
కూటమి నిర్వాకం వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు. కాకినాడ పోర్టులో పవన్ వ్యవహారం గబ్బర్ సింగ్ 2 ను తలపిస్తోందని చెప్పారు. పోర్టు నుంచి రైస్ స్మగ్లింగ్ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.