జగన్ సంచలన నిర్ణయాలు.. అసలు వ్యూహం ఏంటి? గెలుపుపై అంత ధీమా ఎలా?

రానున్న అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

CM Jagan : వన్.. ఒకే ఒక్కడు.. నేనే రాజు, నేనే మంత్రి! 2009 నుంచి 2019లో అధికారంలోకి తెచ్చేవరకు వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా రూపొందుతున్న యాత్ర-2 సినిమా వచ్చే ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైనప్పుడు ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో కాని, రానున్న అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

పార్టీలో జగన్ ఏకఛత్రాధిపత్యం..
రాజకీయ చదరంగంలో గెలుపే లక్ష్యంగా జగన్ పావులను మారుస్తున్న తీరు, అవసరమైతే పావులను వదులుకుంటున్న వైనం.. వైసీపీ పార్టీలో జగన్ ఏకఛత్రాధిపత్యాన్ని రుజువు చేస్తోంది. జనంలో తనకున్న ప్రత్యక్ష సంబంధం, జనంలో తనకున్న ఆదరణ మాత్రమే వచ్చే ఎన్నికల్లో వైసీపీని విజయంవైపు నడిపిస్తుందని, ఈ ప్రయత్నంలో ఎమ్మెల్యే అభ్యర్థుల పాత్ర కొంతవరకు మాత్రమే పరిమితమని జగన్ గట్టిగా భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థిపై జనంలో వ్యతిరేకత లేకపోతే చాలు మిగిలినదంతా తన ప్రతిష్ట మీదే ఆధారపడి ఉంటుందని జగన్ పూర్తిగా విశ్వసిస్తున్నారు. కేవలం ఈ నమ్మకంతోనే.. అవసరమైన చోట సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించడానికి లేదా స్థాన చలనం కలిగించడానికి జగన్ ఏమాత్రం సంకోచించడం లేదు. జగన్ దృష్టి రెండో వైపు పోవడం లేదు.

జగన్ బొమ్మ చూసి మాత్రమే ఓట్లు..
ఒక చోట చెల్లని నాణెం మరోచోట ఎలా చెల్లుతుందని వస్తున్న విమర్శలను కూడా జగన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జగన్ రాజముద్ర ఉంటే చాలు.. నాణెం ఏపీ మొత్తంలో ఎక్కడైనా చెల్లుతుందనేదే జగన్ సన్నిహితుల లెక్కగా ఉంది. జగన్ బొమ్మ చూసి మాత్రమే జనం ఓట్లు వేస్తారని ఆ పార్టీకి చెందిన నేతలే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టికెట్ ఇవ్వకపోతే.. ఎమ్మెల్యేదే తప్పు అని మంత్రి రోజా బహిరంగంగా వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం.

Also Read : సీఎం జగన్ సంచలన నిర్ణయాలు.. మళ్లీ గెలిపిస్తాయా? రిస్క్‌లో పడేస్తాయా? ఏం జరగనుంది

గెలుపు కోసం ఎలాంటి నిర్ణయానికైనా వెనుకాడని జగన్..
కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్న తీరు కూడా వైసీపీలో సంచలనంగా మారింది. ఉదాహరణకు, ఓల్డ్ గుంటూరు జిల్లా పరిధిలోని వేమూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మేరుగ నాగార్జునను ఏకంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోకి వచ్చే సంతనూతలపాడు నియోజకవర్గానికి మార్చడం చూస్తే.. గెలుపు కోసం జగన్ ఎలాంటి నిర్ణయానికైనా వెనుకాడడని పార్టీ వర్గాలకు స్పష్టమైంది. సాధారణంగా చూస్తే.. కేవలం బలమైన లేదా అగ్ర శ్రేణి నాయకులు మాత్రమే తమకు గతంలో ఏ మాత్రం సంబంధం లేని నియోజకవర్గాల్లో బరిలో దిగడానికి సిద్ధపడతారు. పార్టీ నాయకత్వం కూడా అలానే వ్యూహం అనుసరించడం రాజకీయాల్లో ఆనవాయితీగా వస్తోంది.

కేసీఆర్ లాంటి నేతే ఆ పని చేయలేకపోయారు..
కాని, జగన్ తన పార్టీ అభ్యర్థుల మార్పిడిలో అనుసరిస్తున్న వ్యూహం చూస్తే.. తన మీద, తనకున్న ప్రజాబలం మీద జగన్ ఎంత నమ్మకంతో ఉన్నారో అర్థమవుతుంది. తెలంగాణలో బలమైన పునాదులు, నాయకత్వ పటిమ కలిగిన కేసీఆర్ లాంటి నేతే 10-15 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే సాహసం చేయలేకపోయారు. కేటీఆర్, హరీశ్‌రావు ఎంత మొత్తుకున్నా.. కేసీఆర్ తన నిర్ణయం మార్చుకోలేదు. తనను చూసి.. జనం ఓటేస్తున్నప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఏంటి? అనే వైఖరిని కేసీఆర్ అవలంబించారు.

Also Read : ఆ ముగ్గురు మాత్రమే సేఫ్..! 10మందిపై వేటు ఖాయం..! అనంత వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ టెన్షన్

అయితే, జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా తనను చూసి మాత్రమే జనం ఓటేస్తారని ఓ వైపు బలంగా నమ్ముతున్న జగన్.. మరోవైపు తాను నిలుపుతున్న అభ్యర్థికి వ్యక్తిగత పలుకుబడి ఉన్నా లేకున్నా.. జనంలో ఆ అభ్యర్థి పట్ల వ్యతిరేకత మాత్రం ఉండకూడదని భావిస్తున్నారు. కేవలం అందువల్లే, అభ్యర్థులను మార్చేందుకు జగన్ ఏమాత్రం వెనుకాడటం లేదని జగన్‌కు తన బలమేంటో, తన తరుఫున నిలబడే అభ్యర్థుల బలహీనత ఏంటో స్పష్టమైన లెక్కలు ఉన్నాయని వైసీపీ సీనియర్ నాయకులు అంటున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే ఏకంగా తననే మార్చేయాలని జనం నిర్ణయించుకుంటే మినహా.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయే ప్రశ్న ఉండకూడదని జగన్ భావిస్తున్నట్లు చెప్పుకోవాలి. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల జనం సంతృప్తిగా ఉన్నారని, ఇదే తనను విజయ పథంలో నడిపిస్తుందని జగన్ గట్టిగా నమ్ముతుండటం ఈ సందర్భంగా గుర్తించుకోవాలి. విజయంపై జగన్ ధీమాకు ఇదే మూలస్తంభంగా ఉంది.

అభ్యర్థులను భారీస్థాయిలో మార్చేందుకు జగన్ సిద్ధమయ్యారని విస్తృత స్థాయిలో సూచనలు కన్పిస్తున్నా.. వైసీపీలో అలజడి లేకపోవడం చూస్తే… పార్టీపై జగన్‌కు ఉన్న పట్టు ఏంటో కూడా తెలిసిపోతోంది. ఇప్పటివరకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా, వ్యక్తిగతంగా వాయిస్ ఉండి.. నాయిస్ చేయగలిగిన కొందరు అభ్యర్థుల వంతు వచ్చినప్పుడు మాత్రం.. జగన్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారో చూడాలి. ఇలాంటి పరిస్థితులను కూడా జగన్ విజయవంతంగా అధిగమించగలిగారంటే, ఇక జగన్‌కు కావాల్సింది జనం తీర్పే!

ఏది ఏమైనా, జనం తనతోనే ఉన్నారని జగన్ నమ్ముతున్నారు. జనం కూడా ఆశించిన స్థాయిలో జగన్‌ను నమ్ముతున్నారో లేదో తేలాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే. జగన్ మాత్రం నేనే రాజు, నేనే మంత్రి! అనే వైఖరితోనే తన గన్‌ను పూర్తిగా లోడ్ చేస్తున్నారు. ఆయన ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చి, జయహో జగన్! అంటూ పార్టీ అభ్యర్థులు, నేతలు నినదిస్తారో లేదా లెక్కలు తప్పి డామిట్, కథ అడ్డం తిరిగింది! అని నిందిస్తారో కాలమే సమాధానం చెప్పాలి.

Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?

 

ట్రెండింగ్ వార్తలు