MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఎవరెవరు గెలిచారో తెలుసా?
తెలంగాణలో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పీఆర్‌టీయూ, బీజేపీ హవా కొనసాగింది.

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి సత్తా చాటింది. కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలిచారు. ఇక ఉత్తరాంధ్రలో పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ అభ్యర్థులకు టీడీపీ మద్దతు ఇచ్చింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు.
ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఫలితాలు రావాల్సి ఉంది.
గత నెల 27న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు పోటీపడ్డ విషయం తెలిసిందే. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలో కౌంటింగ్ జరిగింది.
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు మొత్తం 9 రౌండ్లకు ఇవాళ తెల్లవారుజామున నాటికి చివరి రౌండ్ పూర్తయ్యేలోపు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 50 శాతానికి పైగా ఆయన ఓట్లు పొందడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. ప్రతి రౌండులోనూ ఆలపాటి దూకుడు ప్రదర్శించడం గమనార్హం.
ఇక గాదె శ్రీనివాసులు నాయుడు పోటీ చేసిన స్థానంలో మేజిక్ ఫిగర్ 10,068 ఓట్లు. ఆయనకు అంతకంటే ఎక్కువగా 12,035 ఓట్లు దక్కాయి.
మరోవైపు, గోదావరి జిల్లాల గ్రాడ్యేయేట్ ఎన్నికల్లో కూటమి నుంచి అభ్యర్థిగా దిగిన పేరాబత్తుల రాజశేఖరం ముందంజలో దూసుకెళ్తున్నారు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల రాఘవులుపై కొన్ని వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది.
తెలంగాణలో?
తెలంగాణలో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పీఆర్‌టీయూ, బీజేపీ హవా కొనసాగింది. ఇందులో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాన్ని పీఆర్‌టీయూ గెలుచుకుంది. కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచారు. నల్లగొండ స్థానంలో పీఆర్‌టీయూ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు.
మరోవైపు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యేయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 21 టేబుళ్లను వేసి లెక్కిస్తున్నారు. ఈ స్థానంలో మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. 25 ఓట్లకు ఒకటి చొప్పున కట్టి అనంతరం లెక్కిస్తారు. ఈ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం పూర్తవుతుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది.