Montha Cyclone: మొంథా తుపాను ముప్పు ముంచుకొస్తోంది. ఏపీలోని తీర ప్రాంతాన్ని వణకిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ముందస్తు చర్యలు చేపట్టింది. అవాంఛనీయ ఘటనల నివారణ కోసం ముందస్తుగా పలు రైళ్లు రద్దు చేసింది.
విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే రైళ్లను కూడా రద్దు చేశారు అధికారులు. రేపు, ఎల్లుండి బయలుదేరే ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. రాజమహేంద్రవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ నుంచి బయలు దేరే పలు రైళ్లు రద్దయ్యాయి. తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి బయలుదేరే పలు రైళ్లను రద్ద చేశారు.
విశాఖ, ఒంగోలు, భీమవరం, మాచర్ల నుంచి బయలుదేరే పలు రైళ్లను రద్ద చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రద్దైన రైళ్ల వివరాలను scr.indianrailways.gov.in వెబ్ సైట్ లో ఉంచారు అధికారులు. అంతేకాదు రద్దు చేసిన రైళ్ల వివరాలను ప్రయాణికుల మొబైల్ కి మేసేజ్ లు పంపింది రైల్వే శాఖ. అలాగే రద్దైన రైళ్లలో ప్రయాణికులకు టికెట్ డబ్బులు మొత్తాన్ని తిరిగి చెల్లించనుంది.
మొంథా తుపాను రేపు మచిలీపట్నం – కళింగపట్నం మధ్య తీరం దాటనుంది. ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రతోపాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖ అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్తలో భాగంగా పలు రైళ్లను రద్దు చేసింది.
Also Read: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. రైల్వే శాఖ అప్రమత్తం.. ఈ రైళ్లు అన్నీ రద్దు..