YCP MP Mithun Reddy
Midhun Reddy: ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. కేసులో కీలక సూత్రధారులుగా భావించిన వారికి నోటీసులు ఇచ్చి వరుసగా విచారణకు పిలుస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. ఇవాళ వైసీపీ నేత, ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.
లిక్కర్ కేసులో విచారణకు హాజరుకాకుండా ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. సిట్ అధికారుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఎట్టకేలకు ఇవాళ విజయవాడలోని సీపీ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కేసులో అక్రమాలపై మిథున్ రెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు నమోదు చేయనున్నారు.
మరోవైపు.. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి కూడా సిట్ అధికారులు విచారణకు రావాలని నోటీలు జారీ చేశారు. ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇచ్చినా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణకు హాజరుకాలేదు. అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన ఇప్పటికే ముందస్తు బెయిల్ కు హైకోర్టులో అప్లయ్ చేసుకున్నారు. సోమవారం కసిరెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో ఈరోజు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్ విచారణకు హాజరుకావడంపై సందిగ్ధత నెలకొంది.