Mp Vijay Sai Reddy : మేము అధికారపక్షం కాదు ప్రతిపక్షం కాదు, ఆ రెండు కూటములకు దూరం- విజయసాయిరెడ్డి
ఆరు నెలల కాలంలో రూ.75 వేల కోట్లు అప్పు చేశారు.

Mp Vijay Sai Reddy : కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు వైసీపీ నేతలు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా పోరుబాట పట్టనున్నట్లు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే భారీగా అప్పులు చేశారని చంద్రబాబు సర్కార్ పై ధ్వజమెత్తారు.
విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ను వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి విశాఖలో విడుదల చేశారు. ఇందులో గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 27వ తేదీన నిరసన నిర్వహిస్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు.
మేము అధికారపక్షం కాదు ప్రతిపక్షం కాదు మేము న్యూట్రల్ గా ఉన్నామని అన్నారు. ఎన్డీయేకి, ఇండియా కూటమికి దూరంగా ఉన్నామని తెలిపారు. ఈ రెండు కూటమిల్లో లోపాలు, సమస్యలు ఉన్నాయని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అని స్పష్టం చేశారాయన.
”మేము మొదటి నుండి చెబుతున్నాం జమిలి ఎన్నికలు వస్తాయని. జమిలి జేపీసీలో నేను కూడా ఒక సభ్యుడిని. జెపిసి ప్రతి రాష్ట్రంలో పర్యటిస్తుంది. ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుంది. జెపిసికి పార్టీ వైఖరిని వైఎస్ జగన్ స్పష్టం చేస్తారు” అని విజయసాయిరెడ్డి చెప్పారు.
Also Read : ఇడుపులపాయకు జగన్.. ఆయన వెంట తల్లి విజయమ్మ, సతీమణి భారతి రెడ్డి
ఆరు నెలల కాలంలో రూ.75 వేల కోట్లు అప్పు చేశారు..
”పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు రూపాయి కూడా పెంచము అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.15 వేల కోట్లకు పైగా భారాన్ని మోపారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.
వచ్చే నెల నుంచి రూపాయిన్నర వరకు యూనిట్ పై భారం పడుతుంది. ఆరు నెలల కాలంలో రూ.75 వేల కోట్లు అప్పు చేశారు. సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. నాణ్యమైన విద్యుత్, విద్య, వైద్యాన్ని అందిస్తామని చెప్పి నాణ్యమైన మద్యాన్ని అందజేస్తున్నారు” అని కూటమి సర్కార్ పై మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
Also Read : 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నాం: ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి