నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం

మందా జగన్నాథం మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు.

నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం

Updated On : January 12, 2025 / 9:37 PM IST

నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి, మృతిచెందారు. మందా జగన్నాథం 1996, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీఎస్పీలో పనిచేశారు.

మందా జగన్నాథం మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కృషిని, పార్టీకి ఆయన అందించిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మందా జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. శోకతప్తులైన మందా జగన్నాథం కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

మందా జగన్నాథం మృతి పట్ల హరీశ్ రావు స్పందిస్తూ.. “నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. నాలుగు సార్లు నాగర్ కర్నూల్ ఎంపీగా పనిచేసి, రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. బీఆర్ఎస్ పార్టీకి సేవలందించారు. జగన్నాథం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.

తిరుమల తొక్కిసలాట ఘటనపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది: జగన్