Nara Bhuvaneswari
Nijam Gelavali : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో రేపటి నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటనలు చేయనున్నారు. రేపు విజయనగరం జిల్లాలో భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది. జనవరి 4న శ్రీకాకుళం జిల్లా, జనవరి 5న విశాఖ జిల్లాల్లో నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతుంది. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తో మనస్థాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది చనిపోయినట్లు పార్టీ వర్గాల సమాచారం. అన్ని కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు.
Also Read : న్యూఇయర్ వేడుకల మాటున ఆ నేతల బలప్రదర్శన.. కాకినాడ జిల్లాలో కాక
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ.. చంద్రబాబు అరెస్టుతో మనస్థాపానికి గురై మృతిచెందిన వారి కుటుంబాలను ‘నిజం గెలవాలి’ పేరిట నారా భువనేశ్వరి ఇటీవల పరామర్శించారు. చంద్రబాబు జైల్లో ఉండగానే భువనేశ్వరి ఈ పర్యనలు చేశారు. అయితే, ఆమె విజయనగరం జిల్లా పర్యటనలో ఉండగా చంద్రబాబుకు బెయిల్ లభించడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. దీంతో భువనేశ్వరి పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది.
తాజాగా నారాభువనేశ్వరి తన పర్యటనలు కొనసాగించేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో మూడు జిల్లాల్లో మూడు రోజుల పాటు ఆమె పర్యటన సాగనుంది. చంద్రబాబు జైలుకెళ్లిన సమయంలో మనస్థాపానికిగురై మరణించిన వారి కుటుంబాలను ఈ పర్యటనలో భువనేశ్వరి పరామర్శిస్తారు.