న్యూఇయర్ వేడుకల మాటున ఆ నేతల బలప్రదర్శన.. కాకినాడ జిల్లాలో కాక
అసమ్మతి రాజకీయాలకు భిన్నంగా.. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో తమ సత్తా ఏంటో చూపాలని నిర్ణయించుకుని అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు.

Kakinada Politics
Kakinada Politics : నూతన సంవత్సరం.. కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది. వైసీపీలో టికెట్ దక్కదనే ప్రచారంలో ఉన్న నేతల బలప్రదర్శనకు వేదికైంది. ఎన్నడూ లేనట్లు విందు రాజకీయం.. కాకినాడ జిల్లాలో కాక పుట్టించింది.
న్యూఇయర్ వేడుకల్లో తమ సత్తా చూపాలని నిర్ణయం..
న్యూఇయర్ వేడుకలు కాకినాడ జిల్లా నేతల బలప్రదర్శనకు వేదికగా మారాయి. జిల్లాలోని ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవనే ప్రచారంతో రాజకీయాలు వేడెక్కాయి. ఒకరిద్దరు నేతలు పక్క పార్టీ నేతలతో చర్చిస్తూనే.. ఇంకా అధికారిక ప్రకటన కోసం ఎదరుచూస్తున్నారు. ఈలోగా అసమ్మతి రాజకీయాలకు భిన్నంగా.. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో తమ సత్తా ఏంటో చూపాలని నిర్ణయించుకుని అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు.
భారీ స్థాయిలో కేడర్ ను తీసుకెళ్తాననే సంకేతాలు..
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తప్పిస్తారనే ప్రచారంతో కొద్ది రోజులుగా జరుగుతోంది. దీంతో నియోజకవర్గంలో తన పట్టు ఏ పాటిదో చూపించాలనే ఉద్దేశంతో అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు చంటిబాబు. జగ్గంపేటలో నాలుగు మండలాల కేడర్‌కు విందు ఏర్పాటు చేసి.. బలప్రదర్శనకు దిగారు. రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా కలిసిన చంటిబాబు తనతో భారీ స్థాయిలో కేడర్‌ను తీసుకెళ్తాననే సంకేతాలిచ్చినట్లు చెబుతున్నారు.
Also Read : డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు..! సిక్కోలు వైసీపీలో హైటెన్షన్
కార్యకర్తలను ఖుషీ చేసిన తోట..
మరోవైపు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్థానంలో నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించనున్న తోట నరసింహం కూడా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. గతంలో జగ్గంపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా పనిచేసిన తోట నరసింహం.. గత ఐదేళ్లుగా నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైసీపీ ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించే ముందు అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తన రీఎంట్రీకి ప్లాన్ చేశారు తోట నరసింహం. స్వగ్రామం వీరవరంలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి.. కార్యకర్తలను ఖుషీ చేశారు మాజీ మంత్రి తోట నరసింహం.
దాదాపు 15ఏళ్ల తర్వాత ముద్రగడ న్యూఇయర్ విందు..
ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కూడా శంఖవరంలో అనుచరుల కలయిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. పర్వత ప్రసాద్‌కు కూడా సీటు లేదనే ప్రచారం నేపథ్యంలో తన పొలిటికల్ ఫ్యూచర్‌పై చర్చించడానికే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు చెబుతున్నారు. ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా విందు రాజకీయానికి తెరతీశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కి రావాలని ఆహ్వానించారు. ముద్రగడ కూడా పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారనే టాక్ నడుస్తోంది. అధికార వైసీపీలో చేరికకు చర్చలు కూడా ముగిశాయని చెబుతున్నారు. దాదాపు 15ఏళ్ల తర్వాత ముద్రగడ పొలిటికల్‌గా యాక్టివ్ అవుతుండటంతో న్యూఇయర్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో అన్ని రకాల స్పెషల్ ఐటెమ్స్ పెట్టడంతో అనుచరులు భారీగా తరలివచ్చారు.
Also Read : ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? టీడీపీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏవి?
మొత్తానికి ఎన్నికల ఏడాదిలో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ను చక్కగా వాడుకున్న నేతలు… ఈ ఏడాదిలో తమ ప్రయాణం ఎలా ఉండబోతోందో… తొలి రోజే చాటిచెప్పేలా సంకేతాలివ్వడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.