Nara Lokesh
Nara Lokesh : బడ్జెట్ లో బీసీల ఊసేది ? అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. అమ్మ ఒడి అబద్ధం, నాన్న బుడ్డి నిజమని సెటైర్ వేశారు. వైసీపీ కోటరీ బాగుపడాలన్న రీతిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారాయన. జగన్ మోహన్ రెడ్డి కాదు.. జగన్ మోసపు రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వార్షిక (2022-23) బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.2,56,257 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై పెదవి విరిచారు.
Read More : AP Budget 2022-23 : ఏపీ బడ్జెట్ 2022-23.. పథకాలకు కేటాయింపులు
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారని, అన్ని వర్గాలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చూపటం ఆయా వర్గాలను మోసగించటమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమ్మ ఒడి అబద్ధం, నాన్న బుడ్డి నిజం..వాహన మిత్ర అబద్దం.. డ్రైవర్లను మోసం చేశారన్నది నిజమని సెటైర్స్ వేశారు. సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ ఈ ప్రభుత్వం కోతలు పెడుతూ పోతోందని, హాజరు శాతం పేరుతో అమ్మఒడిలో భారీ కోత పెట్టారని విమర్శించారు. ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి రూ.1850 పింఛన్ ఇస్తే, తండ్రి కొడుకులు కలిసి ఇచ్చింది కేవలం రూ.625 మాత్రమేనని ఆరోపించారు. మద్యపాన నిషేధం, విద్యారంగం, సంక్షేమం, రైతులు, చేనేత ఇలా అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని నారా లోకేష్ విమర్శించారు.
Read More : AP Budget 2022-23 : ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2,56,257 కోట్లు
ప్రభుత్వం వాస్తవాలు గ్రహించి తెలుగుదేశం హయాంలో అమలు చేసిన కార్యక్రమాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఏపీ బడ్జెట్ విషయానికి వస్తే… శుక్రవారం అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ.2,56,257 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు, ద్రవ్య లోటు రూ.48,724 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు.