మరో అపచారం, శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో కొత్త విగ్రహాల కలకలం, ఇది ఎవరి పని?

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో కొత్త విగ్రహాలు కలకలం రేపుతున్నాయి. ఆలయంలో అనధికారికంగా శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించారు గుర్తు తెలియని వ్యక్తులు. గర్భాలయానికి సమీపంలోనే ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది సహకారంతోనే వీటిని ఏర్పాటు చేసినట్లు భక్తులు అనుమానిస్తున్నారు. అయితే వెంటనే ఆ విగ్రహాలను తొలగించి.. అదే స్థలంలో సంప్రోక్షణ జరిపారు ఆలయ ప్రధాన అర్చకులు. ఈ ఘటనపై ఆలయ అధికారులు విచారణ చేపట్టారు.
సెక్యూరిటీ కళ్లు గప్పి:
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొత్త ప్రతిమలు ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. సెక్యూరిటీ కళ్లు గప్పి సెప్టెంబర్ 8న వాటిని ఇక్కడ పెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. భక్తులు లోపలికి వచ్చేటప్పుడు భద్రతా సిబ్బంది సక్రమంగా తనిఖీలు చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రతిమలను గుర్తించిన వెంటనే అర్చకులతో చర్చించిన ఈవో చంద్రశేఖరరెడ్డి సంప్రోక్షణ చేయించారు. సాధారణంగా ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠించాలంటే అధికారుల అనుమతితో ఆగమోక్తంగా పూజా విధానంతో అమర్చాలి.
https://10tv.in/nep-2020-prepared-after-widespread-consultation-with-over-2-lakh-stakeholders-modi/
ఇప్పటికే అంతర్వేది ఆలయ ఘటనపై రచ్చ:
ఇప్పటికే అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమైన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ ఘటన రాజకీయ రంగు పులుకుంది. హిందుత్వ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాయి. అంతర్వేది ఘటన మరువకముందే తాజాగా శ్రీకాళహస్తిలో మరో అపచారం చోటుచేసుకోవడం భక్తులను బాధించింది.
హిందువుల మనోభావాలు కాపాడాలని డిమాండ్:
అంతర్వేదీ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధపడటంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సద్దుమణుగుతున్నాయని భావిస్తున్న తరుణంలోనే మళ్లీ ఇలా శ్రీకాళహస్తిలో ఈ ఘటన వెలుగుచూడటంపై మరోసారి రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. శ్రీకాళహస్తిలోని గాలిగోపురం దగ్గర ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలు.. హిందువుల మనోభావాలను కాపాడాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందువుల దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరుగుతుందని ఈ సందర్భంగా మరోసారి టీడీపీ నేతలు నిరసన వ్యక్తంచేశారు. వరుస ఘటనలపై హిందూ సంఘాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.