మోసం చేసిన కూతురు, అల్లుడు.. యువతి ఆత్మహత్య 

  • Published By: vamsi ,Published On : May 16, 2020 / 04:42 PM IST
మోసం చేసిన కూతురు, అల్లుడు.. యువతి ఆత్మహత్య 

Updated On : May 16, 2020 / 4:42 PM IST

మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి.. డబ్బులే లోకంలో వాటికన్నా ఎక్కువైపోతున్నాయి. అటువంటి అమానవీయ ఘటనే కృష్ణాజిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. గుడివాడ ఒకటో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. బేతవోలు నిమ్మతోటలో నివాసం ఉంటున్న వీరంకి గంగారావు, చుక్కమ్మల చిన్నకుమార్తె ఆరేపల్లి మౌనిక. గత నెలలో కొడాలికి చెందిన డేనియల్‌ను వివాహం చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు చదువుకోలేదు.

పమిడిముక్కల మండలం వీరంకిలాకులో నివాసముండే ఆమె అక్క, బావ బొల్లా నాగలక్ష్మి, శ్రీనివాసరావు ఇల్లు కట్టుకుంటున్నాం బ్యాంకు ష్యూరిటీ కోసం డాక్యుమెంట్లు కావాలంటూ.. మౌనిక తల్లి చుక్కమ్మ పేరుతో ఉన్న ఎకరంన్నర పొలం డాక్యుమెంట్లు కావాలని తీసుకున్నారు. తల్లిదండ్రులను మోసం చేసి ఆ భూమిని తమ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించేసుకున్నారు. గత నెలలో మౌనిక వివాహం అయ్యింది. కట్నం కింద ఎకరంన్నరలో అరెకరం ఆమె పేరుతో తల్లిదండ్రులు రాశారు. ఆ భూమి డాక్యుమెంట్లు కావాలని తమ పెద్ద కుమార్తెను కోరారు.

అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కూతురు, అల్లుడు చేసిన మోసం బయటపడింది. అంతటితో ఆగలేదు.. తమ చిన్నకూతురిని కూడా తిట్టారు. దీంతో మనస్తాపం చెందిన నవవధువు మౌనిక తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తల్లి చుక్కమ్మ ఫిర్యాదు మేరకు పెద్ద కుమార్తె బొల్లా నాగలక్ష్మి, అల్లుడు శ్రీనివాసరావు, మనమలు సాయి, మరో బాలుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుర్గాప్రసాద్‌ వెల్లడించారు.