TTD : తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. వీఐపీ దర్శనాలు రద్దు
అక్టోబర్ 7 నుంచి 15 వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
- kunduru Vinod
- Updated on- October 4, 2021 / 08:14 PM IST
Ttd
TTD : అక్టోబర్ 7 నుంచి 15 వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నెల 5వ తేదీ మంగళవారం ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు.
Read More : TTD : ఈ నెల 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 11న తిరుమలకు సీఎం జగన్
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మొదట కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమనజనం కార్యక్రమం ఉండటంతో విఐపీ దర్శనాలు రద్దు చేశారు.
Read More : TTD : నిరాశగా వెనుదిరుగుతున్న శ్రీవారి భక్తులు, ఎందుకో తెలుసా ?
