విజయవాడ ఎంపీ సీటు ఆశించా.. ఎమ్మెల్యేగా పోటీ చేయలేను: సుంకర పద్మశ్రీ

నన్ను సంప్రదించకుండానే విజయవాడ తూర్పు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదు.

Padmasree Sunkara: ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తెలిపారు. నేను విజయవాడ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించాను. కొన్ని కారణాలతో అధిష్టానం అవకాశం కల్పించలేక పోయింది. నన్ను సంప్రదించకుండానే విజయవాడ తూర్పు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదు. పార్టీ కోసం, పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం నావంతు కృషి చేస్తాను. నేను తీసుకున్న నిర్ణయానికి అధిష్టానం సహృదయంతో సహకరిస్తుందని భావిస్తున్నానని మంగళవారం ట్విటర్ లో పేర్కొన్నారు.

కాగా, విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా సుంకర పద్మశ్రీ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె నిరాకరించారు. సుంకర పద్మశ్రీ పోటీకి నిరాకరించడంతో ఆమె స్థానంలో విజయవాడ ఈస్ట్ స్థానానికి కాంగ్రెస్ మరో అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంటుంది. కాగా, 38 అభ్యర్థుల పేర్లతో సోమవారం మరో జాబితా విడుదల చేసింది. ఇందుల్లో 10 మంది అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ మార్చేసి వేరేవారికి అవకాశం ఇచ్చింది. దీంతో పలువురు నేతలు నిరసన వ్యక్తం చేశారు.

Also Read: ఏపీ కాంగ్రెస్‌లోనూ టిక్కెట్ల లొల్లి.. షర్మిల మోసం చేశారంటూ కనిగిరి మహిళా నేత ఆరోపణలు

ఇక, విజయవాడ పార్లమెంటు స్థానానికి టీడీపీ తరపున కేశినేని చిన్ని, వైసీపీ తరపున కేశినేని నాని పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి వల్లూరు భార్గవ్ పోటీ చేస్తున్నారు. విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గద్దె రామ్మోహన రావు, వైసీపీ నుంచి దేవినేని అవినాశ్ తలపడుతున్నారు.

చింతలపూడి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎలిజా నామినేషన్
ఏలూరు జిల్లా చింతలపూడిలో కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా నియోజవర్గంలో ప్రజలకు అందించిన సేవలు, ప్రజలతో తనకున్న అనుబంధం తిరిగి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడానికి దోహదపడతాయని ఈ సందర్భంగా ఎలిజా అన్నారు. కాగా, వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు