ఏపీ కాంగ్రెస్‌లోనూ టిక్కెట్ల లొల్లి.. షర్మిల మోసం చేశారంటూ కనిగిరి మహిళా నేత ఆరోపణలు

కాంగ్రెస్ సీటు ఇచ్చినట్టే లాక్కోవడంపై స్థానిక నాయకురాలు కదిరి దుర్గాభవాని ఫైర్ అయ్యారు. సీటు ఇస్తానని హామీయివ్వడంతో ఇప్పటికే తాను నియోజక వర్గంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేసినట్లు చెప్పారు.

ఏపీ కాంగ్రెస్‌లోనూ టిక్కెట్ల లొల్లి.. షర్మిల మోసం చేశారంటూ కనిగిరి మహిళా నేత ఆరోపణలు

Andhra Pradesh Congress Assemly Candidates List: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోనూ టిక్కెట్ల లొల్లి మొదలైంది. ముందుగా ప్రకటించిన అభ్యర్థులను మార్చడంతో పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 10 స్థానాల్లో అభ్యర్థులను మార్చేసింది. శ్రీకాకుళం, గజపతినగరం, తాడికొండ, ఒంగోలు, కనిగిరి, కోవూరు, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, హిందూపూర్ స్థానాల్లో అభ్యర్థులను మారుస్తున్నట్టు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.

హిందూపూర్ స్థానంలో వి. నాగరాజుకు బదులుగా మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లాను అభ్యర్థిగా ఖరారు చేసింది. శ్రీకాకుళంలో పాడి నాగభూషణ్ రావు స్థానంలో అంబటి కృష్ణారావు సీటు దక్కించుకున్నారు. గజపతినగరంలో గడపు కుర్మినాయుడికి బదులుగా దూల శ్రీనివాస్.. తాడికొండలో చిలక విజయకుమార్ స్థానంలో మనిచాల సుశీల్ రాజా.. ఒంగోలులో బుట్టి రమేశ్ బాబుకు బదులుగా తుర్కపల్లి నాగలక్ష్మికి సీటు ఇచ్చారు. కనిగిరిలో కదిరి దుర్గాభవాని స్థానంలో దేవరపల్లి సుబ్బారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. కోవూరులో నెబ్రంబాక మోహన్ స్థానంలో నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి.. సర్వేపల్లిలో పూల చంద్రశేఖర్ కు బదులుగా పీవీ శ్రీకాంత్ రెడ్డి.. గూడూరులో వేమయ్య చిలుకూరి బదులుగా డాక్టర్ యు. రామకృష్ణారావు.. సూళ్లూరుపేటలో గాడి తిలక్ బాబు స్థానంలో చందనమూడి శివను అభ్యర్థిగా ఖరారు చేశారు.

Also Read: టీడీపీకి బిగ్ షాక్.. రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్న నేతలు

షర్మిలను నమ్మి మోసపోయా: కదిరి దుర్గాభవాని
ప్రకాశం జిల్లా కనిగిరి కాంగ్రెస్ సీటు ఇచ్చినట్టే లాక్కోవడంపై స్థానిక నాయకురాలు కదిరి దుర్గాభవాని ఫైర్ అయ్యారు. తనకు కనిగిరి కాంగ్రెస్ సీటు ఇస్తానని చెప్పి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకే కాంగ్రెస్ సీటు ఇస్తానని హామీయివ్వడంతో ఇప్పటికే తాను నియోజక వర్గంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేసినట్లు చెప్పారు. తనతో 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి ఇప్పుడు సంతనూతలపాడుకు చెందిన సుబ్బారెడ్డికి బీ ఫాం ఇచ్చారని వాపోయారు. వైఎస్ షర్మిలను నమ్మి మోసపోయిన తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.