అందుకే తిరుమల ఘటనను వైసీపీ వాడుకుంటోంది: పంచుమర్తి అనురాధ

డిక్లరేషన్ ఇవ్వకుండా అహంకారంతో వ్యవహరించిన జగన్ వెంకటేశ్వరస్వామి గురించి మాట్లాడడం సిగ్గుచేటని తెలిపారు.

Panchumarthi Anuradha

ఉత్తరాంధ్రకి చంద్రబాబు తెచ్చిన రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైసీపీ శవరాజకీయాలు చేస్తోందని శాసన మండలి చీప్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. తిరుమల ఘటన దురదృష్టకరమని చెప్పారు.

అమరావతిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు బాధితులను పరామర్శించి, బాధ్యులపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇచ్చిందని చెప్పారు.

అయినా సరే వైసీపీ నేతలు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారని అనురాధ తెలిపారు. వైసీపీ హయాంలో కచ్చలూరు బోటు ప్రమాదంలో 46 మంది చనిపోయారని అన్నారు. బోటు పరిస్థితి బాగాలేదని తెలిసి కూడా పర్యాటకులను నాడు అనుమతించారని చెప్పారు.

గేట్లు మరమ్మత్తు చేయకుండా అన్నమయ్య డ్యాం కొట్టుకుని పోయేలా చేసి 40 మంది ప్రాణాలు తీసింది జగన్ కాదా? అని అన్నారు. కరోనా సమయంలో తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక వందలాదిమంది చిన్నారులు ప్రాణాలు వదిలారని తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలు అంటే ఇవి అని చెప్పారు. డిక్లరేషన్ ఇవ్వకుండా అహంకారంతో వ్యవహరించిన జగన్ వెంకటేశ్వరస్వామి గురించి మాట్లాడడం సిగ్గుచేటని తెలిపారు. జగన్ హయాంలో టీటీడీ బోర్డులో 90 శాతం మంది నేర చరిత్ర ఉన్నవారేనని అన్నారు.

జగన్ హయాంలో వైసిపి నేతలు టీటీడీని ఏటీఎం మిషన్ గా మార్చుకుంది వాస్తవం కాదా అని అనురాధ ప్రశ్నించారు. వైసీపీ పాలనలో తిరుమలలో అన్యమత ప్రచారం చేసిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని అడిగారు.

Anam RamNarayana Reddy: తిరుపతి ఘటన.. జగన్ వచ్చిన సమయంలో ఏం జరిగిందో క్లారిటీగా చెప్పిన మంత్రి ఆనం