గత వైసీపీ హయాంలో ఈ వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియదు: పవన్ కల్యాణ్

ఎన్నికల్లో గిరిజన గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు.

గత వైసీపీ హయాంలో ఈ వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan

Updated On : December 20, 2024 / 3:58 PM IST

పార్వతీపురం మన్యం మక్కువ మండలం బాగుజోలలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. బాగుజోల-సిరివర గ్రామాల మధ్య 9 కి.మీ. రోడ్డు నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు.

అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గిరిజన గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. గడచిన ఐదేళ్ల పాలనలో ఈ ప్రాంతాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని చెప్పారు. రూ.500 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలస్ కట్టారుగానీ, రూ. 9 కోట్లతో ఈ రోడ్డు నిర్మించలేకపోయారని తెలిపారు.

ఉత్తరాంధ్రను తాకట్టు పెట్టి తెచ్చిన వేలాది కోట్ల రూపాయలు ఏం చేశారో తెలియదని పవన్ కల్యాణ్ అన్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సుమారు 25 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియదని చెప్పారు. 2017లో జనసేన పోరాటయాత్రలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గిరిజనుల కష్టాలు చూశానని తెలిపారు.

“ఇక్కడికి నేను కేవలం రోడ్ల కోసమే రాలేదు. మీ కష్టాలు బాధలు తెలియాలి., యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలి అనేవి తెలుసుకోవాలి. ఇది నేను 5 సంవత్సరాల తరువాత కోసం చెప్పట్లా.. వచ్చే సంవత్సరం లోపు ఏమి చేస్తే బాగుంటది అని ఆలోచిస్తున్నాను” అని అన్నారు.

గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తానని పవన్ చెప్పారు. పర్యాటక అభివృద్ధి చేసి, ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి రెండు నెలలకూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు.

ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.. అందుకే ఇలా చేస్తోంది: వైఎస్‌ షర్మిల