Rangarajan Issue: చిలుకూరు బాలాజీ పూజారీపై దాడి.. పవన్ రియాక్షన్ ఇదే..!

ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని పవన్ చెప్పారు.

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరగడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారని తెలిపారు.

రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్‌పై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలని అన్నారు. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని చెప్పారు. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని అన్నారు.

కాగా, అర్చకుడు రంగరాజన్‌ తన ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వచ్చి తనపై దాడి చేసినట్టు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాదాపు 20 మంది దాడి చేశారని చెప్పారు. దీనిపై వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలుస్తాయని, తన ఈ దాడిపై ఇంతకు మించి మాట్లాడనని అన్నారు.

రంగరాజన్‌ నివాసానికి వచ్చిన కొందరు వ్యక్తులు రామరాజ్యం స్థాపనకు మద్దతివ్వాలని డిమాండ్‌ చేయగా, అందుకు ఆ అర్చకుడు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో దాడికి తెగబడ్డారు. వారిని అడ్డుకోబోయిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారు. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

Maha Kumbh : ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసిన కుంభమేళా.. 300 కి.మీ మేర రద్దీ.. 11 గంటలకు పైగా నిలిచిన వాహనాలు.. నెటిజన్ల రియాక్షన్!