పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించి ఐదేళ్లు దాటినా.. వ్యూహాలు రచించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నారంటున్నారు. పాచిపోయిన లడ్డూలని ఆయన ఓ బహిరంగ సభలో మోదీని ఉద్దేశించి అన్నారు. కానీ, పవన్ పాచిపోయిన వ్యూహాలు అనుసరిస్తూ.. రాజకీయంగా దూసుకుపోవడానికి వీల్లేని పరిస్థితులు కల్పించుకుంటున్నారని జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. వ్యూహాలు రూపొందించడంలో పోటీ పడుతున్నారు. కొత్త పంథాలు అనుసరిస్తున్నారు. కానీ, పవన్ మాత్రం పాత చింతకాయ పచ్చడినే పట్టుకొని చాలా రుచిగా ఉందనుకుంటున్నారట.
ఒకపక్క, రాజకీయంగా తలపండిన టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్థులకు చెక్‌పెట్టగల సమర్థుడు.. ఇంకోపక్క వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కూడా పదేళ్ల అనుభవంతో పాటు.. దూకుడుగా ప్లాన్స్ వేస్తూ సీనియర్లను సైతం గుక్క తిప్పుకోకుండా చేయడంలో దిట్టగా మారారు. మధ్యలో జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం వీరి మధ్యలో సిసలైన వ్యూహరచన లేక చతికిలపడిపోతున్నారని జనాలు అనుకుంటున్నారు.
పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఒకసారి చూస్తే.. ఎక్కడా కూడా ఆయనలో నిలకడ కనిపించడం లేదనే చెప్పాలి. స్పష్టమైన విధానం కూడా తీసుకోవడం లేదంటున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్.. సడన్‌గా ఎన్నికల్లో పోటీ చేసి చిత్తయిపోయారు. ఎన్నికల తర్వాత నుంచి కొంచెం యాక్టివ్‌గానే ఉంటున్నారు.
జగన్ దెబ్బకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి :
అసలు విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్‌కు ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడమే తప్ప… వ్యూహాత్మకంగా ఎలా ముందడుగు వేయాలన్నది ఒంటబట్టలేదని అంటున్నారు. జగన్ దూకుడుకు 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు కూడా తట్టుకోలేక తన అనుభవాన్ని రంగరించి ఎలాగోలా నిలదొక్కుకోవాలని చూస్తున్నారు. జగన్ దెబ్బకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. కాకపోతే తన సీనియారిటీ, బలమైన కేడర్ ఉండటం వల్ల చంద్రబాబు ఎలాగోలా పార్టీని నెట్టుకొస్తున్నారు. కానీ, పవన్ కల్యాణ్ విషయానికొచ్చే సరికి పార్టీకి కేడర్ లేదు. తనతో ఉన్న నాయకులకు జనాల్లో పట్టు కనిపించడం లేదు. ఏదైనా ఉందీ అంటే అది తనకున్న ఇమేజ్.. అభిమానులే. దీంతో రాజకీయ ఎత్తుగడల్లో ఆయన పూర్తిగా తేలిపోతున్నారని జనాలు అంటున్నారు.
బాబు రూటులోనే పవన్ :
నిజానికి గడచిన ఆరు నెలలుగా చంద్రబాబు రూటులోనే పవన్ వెళ్తున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. తాజాగా జగన్ విసిరిన మూడు రాజధానుల వ్యూహంలో పవన్ చిక్కుకుని బాగా కన్‌ఫ్యూజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంలో బాబు చిక్కుకున్నా అమరావతి ప్రతిపాదన ఆయనే తీసుకొచ్చారు కాబట్టి దానికే ఫిక్సయ్యారు. ఇక్కడ పవన్ వ్యూహం ఏంటో కూడా అర్ధం కావడం లేదని జనాలు తలలు పట్టుకుంటున్నారు.
తొలుత మూడు రాజధానుల ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత వెనక్కి తగ్గి మంత్రి వర్గం నిర్ణయం తర్వాత జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి జనసేన నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు. ఇవన్నీ చూసిన తర్వాత రాజకీయ వ్యూహాలు రచించడంలో పవన్ బాగా వీక్ అని జనాలు ఫిక్సయిపోయారట.