Pawan Kalyan OSD : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ వెంకట కృష్ణకు మళ్లీ అవకాశం.. మరో మూడేళ్ల కొనసాగింపు..
Pawan Kalyan OSD : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కె. వెంకట కృష్ణ మరో మూడేళ్లు కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Deputy CM Pawan Kalyan
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- పవన్ కల్యాణ్ ఓఎస్డీ వెంకట కృష్ణకు మూడేళ్లు రీ-అపాయింట్మెంట్
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్
Pawan Kalyan OSD : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. జూన్ 30వ తేదీతో పదవీ విరమణ పొందనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ కె. వెంకట కృష్ణకు రీ-అపాయింట్మెంట్ కల్పించింది. జూలై 1 నుంచి మరో మూడేళ్ల పాటు ఆయన అదే బాధ్యతల్లో కొనసాసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సోమవారం సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్-ఏ) జారీ చేసిన జీవో ఆర్టీ నెం. 1282 ప్రకారం.. డిప్యూటీ సీఎం కార్యాలయం సమర్ధవంతంగా పనిచేయడానికి కె. వెంకట కృష్ణ సేవలు అవసరమని పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపింది. వాస్తవానికి వెంకటకృష్ణ జూన్ 30న పదవీ విరమణ పొందనున్నారు. అయితే, జూలై 1, 2026 నుంచి ఆయనను తిరిగి ఒప్పంద ప్రాతిపదికన (రీ-అపాయింట్మెంట్) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, కె. వెంకటకృష్ణ డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఓఎస్డీగా మరో మూడేళ్ల పాటు లేదంటే డిప్యూటీ సీఎం పదవీకాలం ముగిసే వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆయనకు అందే వేతనం విషయంలో చివరిగా పొందిన జీతం నుంచి పెన్షన్ మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. అదేవిధంగా.. ఈ రీ-అపాయింట్మెంట్ కారణంగా ఇతర ఉద్యోగుల పదోన్నతులు లేదా సర్వీస్ సీనియారిటీపై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
డిప్యూటీ ముఖ్యమంత్రి పరిధిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు సంబంధించిన వ్యవహారాలను వెంకటకృష్ణ పర్యవేక్షించనున్నారు.
