Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. చంపేస్తామని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో సందేశాలు వచ్చాయి. బెదిరింపు కాల్స్, సందేశాలు వచ్చిన విషయాన్ని అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని కృష్ణలంక పోలీసులు గుర్తించారు. ఆగంతకుడు సెల్ ఫోన్ ట్రాక్ చేసిన పోలీసులు లబ్బీపేటలో ఉన్నట్లుగా గుర్తించారు. అయితే, పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తికోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: Manchu Family Dispute: అందుకే నాపై అసత్య ఆరోపణలు.. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన మంచు మనోజ్
పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చిన సెల్ ఫోన్ నెంబర్ గల వ్యక్తి మల్లికార్జున రావుగా గుర్తించిన పోలీసులు.. మల్లికార్జున రావు ఎవరు? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తిరువూరుకు చెందిన వైద్య దంపతులకు అతడు బావమరిదిగా గుర్తించారు. వ్యసనాలకు బానిసై భార్యబిడ్డలకు మల్లికార్జున రావు దూరంగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. తిరువూరుతోపాటు నెల్లూరులోకూడా మల్లికార్జునరావు ఉంటాడని తెలుసుకున్న పోలీసులు .. అక్కడ కూడా గాలిస్తున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Naga babu : ఏపీ క్యాబినెట్ లోకి నాగబాబు..! జనసేన నుంచి మంత్రిగా త్వరలో బాధ్యతల స్వీకరణ..!
పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడంపై హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. డీజీపీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.