Pawan Kalyan to meet Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు సమావేశం కానున్నారు. రేపు ప్రధాని మోదీ విశాఖపట్నం రానున్న విషయం తెలిసిందే. అక్కడ రూ.400 కోట్లతో చేపట్టే విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే, మరి కొన్ని ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
అంతేగాక, బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలోనే మోదీతో పవన్ కల్యాణ్ దాదాపు 15 నిమిషాల పాటు భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి పవన్ కల్యాణ్ విశాఖ వెళ్తారు. రేపు రాత్రి 8.30 గంటలకు ఐఎన్ఎస్ చోళాలో మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం అవుతారు.
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ-జనసేన మైత్రిపై కూడా వారిద్దరు చర్చించనున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ ఇటీవల విశాఖలో పర్యటించారు. అయితే, ఆ సమయంలో ఆయనను పోలీసులు అడ్డుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..