PM Narendra Modi has expressed shock over the Tirupati stampede incident
Tirupati Stampede : తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది. వైకుఠం ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. 48 మంది గాయపడ్డారు. బైరాగిపట్టెడ కేంద్రం దగ్గర ముగ్గురు మృతి చెందగా.. శ్రీనివాస అతిథిగృహం దగ్గర ఒకరు, రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. గాయపడిన వారికి తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనపై డీజీపీ, టీటీడీ ఈవో, తిరుపతి కలెక్టర్, ఎస్పీలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. భక్తులు భారీ సంఖ్యలో వస్తారని తెలిసికూడా ఎందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Tirupati Stampede : తిరుపతిలో తొక్కిసలాటకు కారణం ఏంటంటే.. మృతులు వీరే, మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..
నాలుగు కేంద్రాల్లో తోపులాట ..
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంకోసం తిరుపతిలో ఎనిమిది కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10, 111, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, 9వ తేదీ (గురువారం) ఉదయం 5గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో బుధవారం ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు టోకెన్లు జారీచేసే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో జీవనకోన, బైరాగిపట్టెడ, శ్రీనివాసం, అలిపిరి ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. రాత్రి ఏడుగంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూలైన్లలోకి ప్రవేశించబోయారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో బైరాగిపట్టెడ కేంద్రం దగ్గర ముగ్గురు మృతి చెందగా.. శ్రీనివాస అతిథిగృహం దగ్గర ఒకరు, రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.
Also Read: Tirupati Stampede : తిరుపతిలో తొక్కిసలాట.. సీఎం చంద్రబాబు సీరియస్, కీలక నిర్ణయం..
ఇవాళ తిరుపతికి చంద్రబాబు..
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తిరుమలలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ లు తిరుపతి చేరుకున్నారు. క్షతగాత్రులకు సహాయక చర్యలు, వైద్య సేవలు సక్రమంగా అందించేలా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే, చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు తిరుపతికి చేరుకోనున్న చంద్రబాబు.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు. అనంతరం ఘటనపై అధికారులతో సమీక్షించి తగిన ఆదేశాలు ఇవ్వనున్నారు.
Also Read: Tirupati Tragedy : తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య
మృతులు వీరే..
విశాఖపట్టణంకు చెందిన రజనీ (47), శాంతి (34), లావణ్య (40), నర్సీపట్నంకు చెందిన నాయుడు బాబు (51), కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి..
తిరుపతి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో ఇలా జరగడం బాధాకరం అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తుందని మోదీ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఏమన్నారంటే..
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో అన్నివిధాలా సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను రాహుల్ గాంధీ కోరారు.