Tirupati Stampede : తిరుపతిలో తొక్కిసలాట.. సీఎం చంద్రబాబు సీరియస్, కీలక నిర్ణయం..
తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Tirupati Stampede : తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. తొక్కిసలాటలో గాయపడ్డ వారికి ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. టీటీడీ అధికారులతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. వివరాలు తెలుసుకుంటున్నారు.
తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీలతో చంద్రబాబు మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. అధికారులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ మేరకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. కొందరు అధికారుల వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు.
మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పున:సమీక్షించాలని చంద్రబాబు చెప్పారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో గురువారం ఉదయం సీఎం చంద్రబాబు తిరుపతికి వెళ్లనున్నారు. తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నారు.
అటు..తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు మృతి చెందడం బాధాకరం అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
Also Read : తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య