Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. తుపాను కారణంగా అన్ని పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
మరోవైపు తుపాను కారణంగా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన రద్దైంది. ఈ నెల 29న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హబ్ కి ప్రధాని శంకుస్థాపన చేయాల్సిందిగా తుపాను ప్రభావంతో పర్యటన రద్దైంది. దీంతో మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 29న విశాఖలో ప్రధాని మోదీ పర్యటించాల్సి ఉంది. అచ్యుతాపురం మండలం పూడిమడికలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించాల్సి ఉంది. దాంతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితయం చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏయూలో విస్తృత ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. ప్రధాని వచ్చిన వెంటనే నేరుగా ఏయూకి చేరుకోవాల్సి ఉంది.
అదే సమయంలో ప్రజలకు అభివాదం చేసేలా ఒక రోడ్ షో ను నిర్వహించాలని భావించారు. సిరిపురం నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్ షో నిర్వహించాలని కూటమి నేతలు ప్లాన్ చేశారు. అయితే, అనూహ్యంగా తుపాను ప్రభావంతో ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దైంది. దీనికి ప్రత్యామ్నాయంపై అధికారులు దృష్టి పెట్టారు. అదే రోజున వర్చువల్ గా గ్రీన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించే అవకాశం ఉంది.
ఇప్పటికే తుపాను ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 27వ తేదీ నుంచి తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుపానుకు ఫెంగాల్ గా నామకరణం చేయనున్నారు.
చెన్నై-శ్రీలంక తీరాల మధ్య పయనించి అక్కడ తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. చెన్నై వైపు తీరం దాటే అవకాశం ఉన్నా.. తుపాను ప్రభావం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు అధికారులను అలర్ట్ చేసింది. అటు పంటలు చేతికొచ్చే సమయం కావడంతో రైతులను సైతం అప్రమత్తం చేసింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంట పొలాలను భద్రపరుచుకోవాలని సూచించింది. గాలుల వేగం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. తుపాను ఎఫెక్ట్ తో ప్రధాని మోదీ తన ఏపీ పర్యటనను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
28 లేదా 29వ తేదీన తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. 28వ తేదీన తుపానుగా మారి ఆ తర్వాత తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి.. 29వ తేదీన కూడా ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. తుపాను తీరం దాటే సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవడం, గాలుల వేగం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read : పరారీలో దర్శకుడు రాంగోపాల్ వర్మ..! ఏపీ పోలీసుల వేట..