Tirupati fire Mystery
Sanambatla Fire Incidents : తిరుపతి జిల్లాలోని శానంబట్ల గ్రామ మంటల మిస్టరీ వీడింది. తల్లిపై కోపంతో ఓ యువతి ఊరికి నిప్పు పెట్టారు. మంటల వెనుక సొంతింటి మనుషుల ప్రమేయం ఉన్న విషయాన్ని పోలీసులు నిగ్గుతేల్చారు. గ్రామంలో మంటలు అంటించింది ఓ యువతిగా నిర్ధారణ చేశారు. తల్లి ప్రవర్తన నచ్చక గ్రామానికి చెందిన యువతి గ్రామంలో కొన్ని చోట్ల నిప్పు పెట్టినట్లు గుర్తించారు.
ఈ మేరకు ఏఎస్పీ వెంకట రావు తిరుపతిలో సోమవారం మీడియాతో వివరాలను వెల్లడించారు. ఆ గ్రామంలోని కీర్తి అనే యువతి మంటలు చెలరేగడానికి ప్రధాన కారణమని.. తనే ఈ పని చేసిందని తెలిపారు. తన తల్లి ప్రవర్తన నచ్చక కీర్తి ఈ పని చేసినట్లుగా పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగితే ఏదో కీడుగా భావించి తల్లితో పాటు ఊరు వదిలి వెళ్లే అవకాశం వస్తుందని భావించి కీర్తి ఇలా చేసిందన్నారు.
తల్లి ప్రవర్తనలో మార్పు కోసమే ఇది చేసిందని పేర్కొన్నారు. యువతి మొత్తం 12 అగ్ని ప్రమాద ఘటనలకు పాల్పడినట్లు తెలిపారు. గ్రామంలోని కొందరితో ఉన్న గోడవల కారణంగా వారి ఇళ్లల్లోనూ యువతి మంటలు పెట్టిందని వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందన్నారు. మంటల వెనుక ఎలాంటి రసాయనాలు లేవని చెప్పారు.
కీర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారని వెల్లడించారు. అగ్గి పెట్టె తోనే తాను మంటలు పెట్టినట్లు ఒప్పుకున్నారు. కీర్తి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి మూఢ నమ్మకాలు లేవని స్పష్టం చేశారు.