Perni Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్నినాని భార్య పేర్ని జయసుధ విచారణ ముగిసింది. నాలుగు గంటలకు పైగా పోలీసులు జయసుధను ప్రశ్నించారు. రేషన్ స్కామ్ కేసు అంశాలపై జయసుధ నుంచి వివరాలు సేకరించారు పోలీసులు. విచారణ మొత్తాన్ని వీడియో కెమెరాలో రికార్డ్ చేశారు పోలీసులు. బియ్యం మాయం కేసులో జయసుధ ఏ-1గా ఉన్నారు.
సుదీర్ఘంగా 4 గంటలకుపైగా జయసుధ విచారణ..
విచారణకు రావాలని బందర్ తాలూకా పోలీసులు నోటీసులు ఇవ్వటంతో ఆమె న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులు ఆమెను 4 గంటలకుపైగా ప్రశ్నించారు. కాగా, పోలీసుల విచారణపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎంతసేపు విచారిస్తారు అంటూ ఆందోళనకు దిగారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని ఎంతసేపు విచారిస్తారని పేర్ని జయసుధ తరపు లాయర్లు ప్రశ్నించారు. వైసీపీ శ్రేణులకు ఎస్ఐ సత్యనారాయణ సర్ది చెప్పారు.
Also Read : వారిని కంట్రోల్ చేస్తున్నా.. పదే పదే హెచ్చరిస్తున్నా: చంద్రబాబు
విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు..
రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో బుధవారం మధ్యాహ్నం విచారణకు హాజరుకావాలని మచిలీపట్నం తాలూకా పోలీసులు మాజీ మంత్రి పేర్నినాని భార్య జయసుధకు నోటీసులు ఇచ్చారు. అందుకు అనుగుణంగా పేర్ని జయసుధ న్యాయవాదుల సమక్షంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, విచారణ త్వరగా ముగించాలని చెప్పి సీఐకి విన్నవించారు జయసుధ.
ఆ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదన్న జయసుధ..
పోలీసులు సుదీర్ఘంగా జయసుధను విచారించారు. 4 గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. కీలకమైన ప్రశ్నలు సంధించారు. ఈ కేసుకి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశామని, వాళ్లు కొన్ని కీలక విషయాలు తమకు చెప్పారని, రేషన్ బియ్యం మాయం అంశంలో మీ హస్తం ఉందని, మీ ప్రోద్బలంతోనే రేషన్ బియ్యం మాయం జరిగిందని.. నిన్నటి విచారణలో ఆ నలుగురు వెల్లడించారని, దీనికి మీరేం సమాధానం చెబుతారని జయసుధను ప్రశ్నించారు పోలీసులు.
నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు- జయసుధ
అయితే, ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జయసుధ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఫోన్ పే ద్వారా 23 లక్షల రూపాయల లావాదేవీ జరిగిందని, ఈ అమౌంట్ మీకు చేరిందని వాళ్లు చెప్పారని జయసుధను ప్రశ్నించారు పోలీసులు. ఆ అమౌంట్ కు, నాకు సంబంధం లేదని.. నా మీద ఆరోపణలు చేస్తున్నారని, కేవలం గోడౌన్ యజమానిగా మాత్రమే తాను ఉన్నానని, బియ్యం మాయం కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులతో చెప్పారు జయసుధ.
Also Read : విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..