విశాఖ ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కేసులో అనుమానాలు.. పోలీసుల విచారణలో అప్పలరాజు పొంతనలేని సమాధానాలు

విశాఖ కైలాసపురం ప్రాంతానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి లాలం అప్పలరాజు కిడ్నాప్ కేసులో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణలో అప్పలరాజు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. దీంతో అప్పలరాజు వ్యవహారాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. తనను ముగ్గురు వ్యక్తులు ఆటోలో ఎక్కించుకుని కిడ్నాప్ చేసి, తర్వాత ఒంటి మీద బంగారం, డబ్బులు తీసుకుని తీవ్రంగా గాయపరిచినట్లు నిందితుడు నిన్న చెప్పాడు. అయితే సీసీ టీవీ ఫుటేజీలో మాత్రం తానంతట తానే ఆటోలో ఎక్కినట్లు కనిపిస్తోంది. దీంతో వ్యక్తి గత కారణాలతోనే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అప్పలరాజు ఫైనాన్స్ కు సంబంధించి కొన్ని గొడవల కారణంగా కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై అప్పలరాజు మీద పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అప్పలరాజు చెప్పినదాని ప్రకారం తాను ద్వారకా బస్ స్టేషన్ నుంచి ఆటో ఎక్కే సమయంలో కొంతమంది తనను బలవంతంగా లాగి ఆటోలో ఎక్కించుకుని వెళ్లి అక్కడి నుంచి ద్వారకా కాంప్లెక్స్ వెనుక సాగర్ నగర్ కు తీసుకెళ్లారు.
అక్కడికి తీసుకెళ్లిన అనంతరం నిర్మానుష్య ప్రదేశంలో తనను కొట్టి తన దగ్గర ఉన్న బంగారంతోపాటు లక్షా 25 వేల రూపాయలను దోచుకుని వెళ్లారు. ఈ క్రమంలోనే తాను తేరుకుని తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తే వాళ్లే తనను కేజీహెచ్ కు తీసుకెళ్లారు అని అప్పలరాజు చెప్పడంతో పోలీసులు దాదాపు ఐదు బృందాలుగా విడిపోయి దీనిపై ఎంక్వైరీ చేశారు.
ఈ క్రమంలోనే పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పలరాజు చికిత్స పొందుతున్న నేపథ్యంలో అతనిపై కత్తి గాట్లు ఉన్నాయి. కానీ షర్ట్ ఏ మాత్రం చిరగలేదు. వేసుకున్న షర్ట్ వేసుకున్నట్టుగానే ఉంది. అయితే షర్ట్ మీద ఎలాంటి చిరుగు, గాయాలు లేకుండా కేవలం లోపలే గాయాలు ఎలా అయినవి? అలాగే అప్పలరాజు ఆటోలో ముగ్గురు వ్యక్తులు బలవంతంగా ఎక్కించుకెళ్లారని చెబుతున్నారు.
కానీ ఆటోను పరిశీలిస్తే ఆటోలో కేవలం అప్పలరాజు, ఆటో డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ఒకవేల దొంగలు అతన్ని దోచుకుని వెళ్లినట్లైతే సెల్ ఫోన్ ఎందుకు వదిలేశారు? అనే కోణంలో పోలీసులు విచారించారు. అప్పలరాజు కావాలనే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి విచారణ చేసి మరికొన్ని విషయాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.