Posani Krishna Murali : సినీ నటుడు పోసాని కృష్ణమురళి జడ్జి ఎదుట కంటతడి పెట్టారు. రెండు రోజుల్లో తనకు బెయిల్ రాకపోతే బలవన్మరణమే శరణ్యం అని వాపోయారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన పోసాని.. తాను తప్పు చేస్తే నరికేయాలన్నారు.
తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్నారు. రెండు ఆపరేషన్లు జరిగాయని వాపోయారు. తనకు స్టెంట్లు వేశారని చెప్పారు. 70ఏళ్ల వయసులో తనను రాష్ట్రమంతా తిప్పుతున్నారని, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వ్యక్తిగత కోపంతో నాపై ఫిర్యాదు చేశారని పోసాని ఆరోపించారు.
కర్నూలు జైలు నుంచి తీసుకొచ్చి గుంటూరు మెజిస్ట్రేట్ ముందు పోసానిని హాజరుపరిచారు పోలీసులు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Also Read : విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయమా? జగన్‌తో రాజీ ముచ్చటే లేదనడానికి రీజనేంటి?
పోసాని కృష్ణమురళిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాగా, నాలుగు కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. దాంతో ఇవాళ ఉదయం ఆయన బెయిల్ పై విడుదలై ఇంటికి వెళ్తారని అనుకున్న సమయంలో అనూహ్యంగా సీఐడీ వాళ్లు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 5 నెలల క్రితం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోసానిని అదుపులోకి తీసుకుని విచారించాలంటూ గుంటూరు సీఐడీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం కర్నూలు వెళ్లిన సీఐడీ అధికారులు.. పోసాని జైలు నుంచి విడుదల అవగానే అదుపులోకి తీసుకున్నారు. పోసానిని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా గుంటూరు జడ్జి ముందు పోసాని కంటతడి పెట్టారు. 70 సంవత్సరాల వయసులో నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన కన్నీరుమున్నీరు అయినట్లు తెలుస్తోంది.
తప్పు చేస్తే నరికేయండి.. కానీ, నన్ను ఇబ్బంది పెట్టొద్దని గుంటూరు న్యాయమూర్తి ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాకు భార్య, పిల్లలు ఉన్నారు, నన్ను ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారు, దయచేసి నా తప్పును మన్నించండి అంటూ న్యాయమూర్తి ముందు పోసాని వాపోయినట్లు సమాచారం. రెండు రోజుల్లో తనకు బెయిల్ రాకపోతే బలవన్మరణమే శరణ్యం అని జడ్జి ఎదుట లాయర్లతో పోసాని అన్నట్లుగా తెలుస్తోంది.
Also Read : ఒక్కొక్కరికి రూ.15వేలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి- తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై పోసాని ఇష్టానుసారంగా మాట్లాడారని ఆయనపై టీడీపీ, జనసేన నాయకులు రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెట్టారు.