విజయవాడ వెస్ట్ నుంచి జనసేన అభ్యర్థిని నేనే: పోతిన మహేశ్

విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరపున తానే పోటీలో ఉంటానని నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Pothina Mahesh confident on janasena seat in Vijayawada West

Pothina Mahesh : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో టికెట్ల కోలాహలం కొనసాగుతోంది. ప్రధాన పార్టీల్లో పోటీకి రెడీ అవుతున్న ఆశావహులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధినేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికార వైసీపీ పార్టీ ఇప్పటికే 50 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. 9 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లనూ ప్రకటించింది. టీడీపీ తన ఫస్ట్ లిస్ట్ ను సంక్రాంతికి ప్రకటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు కూడా తమకు టికెట్లు కేటాయించాలని మీడియా ద్వారా తమ పార్టీ అధ్యక్షుడిని కోరుతున్నారు. విజయవాడ వెస్ట్ సీటు తనకే దక్కుతుందని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వెల్లంపల్లిని దీటుగా ఎదుర్కొంటా
విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరపున తానే పోటీలో ఉంటానని, పవన్ కళ్యాణ్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని 10టీవీతో పోతిన మహేశ్ చెప్పారు. టీడీపీ, జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్ లో తన పేరు కచ్చితంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయినప్పటికీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో సమస్యలపై నాలుగున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నానని తెలిపారు. వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అక్రమాలే వైసీపీని ఓడిస్తాయన్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యమని, తనకు టికెట్ ఇస్తే వెల్లంపల్లిని దీటుగా ఎదుర్కొంటానని చెప్పారు. అవినీతి కంపుకొడుతున్న వైసీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు.

Also Read: పెనమలూరు వైసీపీలో టికెట్ ప్రకంపనలు.. రాజీనామా చేసిన మహిళా యువనేత

టీడీపీ నేత, మాజీ మంత్రి జలీల్ ఖాన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడంపై స్పందిస్తూ.. టికెట్ ఆశించే వారు చాలా మంది ఉంటారని, అటువంటి వారు తమ పార్టీ అధ్యక్షుడిని కలవడంలో తప్పేంలేదన్నారు. తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఇరువురు చర్చించారని, అంతకుమించి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. విజయవాడ వెస్ట్ టికెట్ పై హామీ లభించిందా అన్న ప్రశ్నకు తొందరలోనే అధిష్టానం అన్ని విషయాలు వెల్లడిస్తుందని, తనకు అంతా మంచి జరుగుతుందని జవాబిచ్చారు. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును తప్పించి విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరును వైసీపీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నందున ఇక్కడి నుంచి ఈ ఏ పార్టీలో బరిలో ఉంటుందో తేలాల్సి ఉంది.