జోగి రమేశ్‌కు పెనమలూరు టికెట్.. రాజీనామా చేసిన మహిళా నేత

పెనమలూరు వైసీపీలో టికెట్ ప్రకంపనలు రేగాయి. పెనమలూరు సీటును మంత్రి జోగి రమేశ్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ డీసీఎంఎస్ చైర్‌ప‌ర్స‌న్‌ పడమట స్నిగ్ధ తన పదవికి రాజీనామా చేశారు.

జోగి రమేశ్‌కు పెనమలూరు టికెట్.. రాజీనామా చేసిన మహిళా నేత

padamata snigdha resigns to DCMS chairpeson

Updated On : January 12, 2024 / 6:00 PM IST

Padamata Snigdha: ఏపీ అధికార వైసీపీలో నిరసన సెగలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ వైసీపీలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పెనమలూరు సీటును మంత్రి జోగి రమేశ్‌కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ డీసీఎంఎస్ చైర్‌ప‌ర్స‌న్‌ పడమట స్నిగ్ధ తన పదవికి రాజీనామా చేశారు. తమకు కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా జోగి రమేశ్‌కు పెనమలూరు టికెట్ ఇవ్వడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గ సీటును ఆయనకు ఇవ్వడం సమంజసం కాదని 10 టీవీతో అన్నారు. కృష్ణా జిల్లాలో పార్టీ జెండా పట్టుకున్న మొట్టమొదటి వ్యక్తి తన తండ్రి అని గుర్తు చేశారు.

జోగి రమేశ్‌కు సహకరించం
వచ్చే ఎన్నికల్లో మంత్రి జోగి రమేశ్‌ ఓడిపోవడం ఖాయమని, పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగిందని వాపోయారు. దశాబ్దాల తరబడి నియోజకవర్గాన్ని నమ్ముకుని 100 కోట్ల రూపాయలకు పైగా పార్టీ కోసం ఖర్చుపెట్టిన తమ ఫ్యామిలీని వైసీపీ అధిష్టానం విస్మరించిందన్నారు. పెడనలో గెలవలేని వ్యక్తిని పెనమలూరుకి తీసుకొచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. అధిష్టానానికి తమ నిరసన తెలియజేయడానికే డీసీఎంఎస్ చైర్‌ప‌ర్స‌న్‌ పదవికి తాను రాజీనామా చేసినట్టు చెప్పారు. అయితే వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని, కానీ జోగి రమేశ్‌ గెలుపు కోసం పనిచేయబోమని స్పష్టం చేశారు. తానే కాకుండా, తమ కేడర్ కూడా ఆయనకు సహకరించదన్నారు. పార్టీలో అనేక అవమానాలను ఎదుర్కొన్నామని, డీసీఎంఎస్ చైర్‌ప‌ర్స‌న్‌ గా ఉంటూ ముఖ్యమంత్రిని కూడా కలవలేకపోయానని ఆవేదన చెందారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను తెలియజేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయిందన్నారు.

Also Read: వైసీపీకి మరో షాక్..? రాజీనామా యోచనలో ఎమ్మెల్యే? పార్టీ మోసం చేసిందని తీవ్ర ఆవేదన

పునరాలోచన చేయాలి: సురేశ్‌బాబు
సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి టికెట్ నిరాకరించడంతో పెనమలూరు టికెట్ తమకే వస్తుందని భావించామని స్నిగ్ధ తండ్రి, వైసీపీ సీనియర్ నేత పడమట సురేశ్‌బాబు అన్నారు. తనకు కాకపోయినా తన కుమార్తెకు అయినా టికెట్ ఇస్తారనుకున్నామని చెప్పారు. ఇప్పటికైనా సీఎం జగన్ పునరాలోచన చేయాలని కోరారు. తమ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని విన్నవించారు.

Also Read: అందుకే నాకు సీటును నిరాకరించారేమో: పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి