వైసీపీకి మరో షాక్..? రాజీనామా యోచనలో ఎమ్మెల్యే? పార్టీ మోసం చేసిందని తీవ్ర ఆవేదన

వైసీపీ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ చెప్పిన పనులు మాత్రమే చేశానని, తన పనితీరు ప్రజలకు నచ్చినా.. పెత్తందారులకు నచ్చలేదన్నారు.

వైసీపీకి మరో షాక్..? రాజీనామా యోచనలో ఎమ్మెల్యే? పార్టీ మోసం చేసిందని తీవ్ర ఆవేదన

MLA Vunnamatla Eliza To Quit YCP

Updated On : January 12, 2024 / 5:53 PM IST

Vunnamatla Eliza : వైసీపీలో ఇంఛార్జిల మార్పులు చేర్పులు ఆ పార్టీలో చిచ్చు రాజేస్తున్నాయి. మార్పుల పేరుతో సీఎం జగన్ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. కొందరికి స్థానచలనం చేశారు. మరికొందరిని ఎంపీలుగా బరిలోకి దింపుతున్నారు. ఈ పరిణామాలు పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. టికెట్ రాని నేతలు, ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేని వారు పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో ఎమ్మెల్యే అదే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా. వైసీపీ ప్రభుత్వం తనను మోసం చేసి రోడ్డు మీద నిలబెట్టిందని ఆరోపించారాయన. వైసీపీ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ చెప్పిన పనులు మాత్రమే చేశానని, తన పనితీరు ప్రజలకు నచ్చినా.. పెత్తందారులకు నచ్చలేదన్నారు. అందుకే తనకు సీటు రాకుండా చేశారని వాపోయారు ఎలీజా.

Also Read : ఎన్నికల వేళ రాజకీయాన్ని తనవైపు తిప్పుకున్న ముద్రగడ

”పార్టీ ఆదేశాలు మాత్రమే నేను అమలు చేశాను. నాకు సీటు వస్తే పెత్తందారులకు మనుగడ ఉండదని వైసీపీ అధిష్టానానికి చెప్పి నాకు సీటు లేకుండా చేశారు. కార్యకర్తలు, అనుచరుల సలహాలు, సూచనల మేరకు త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటా” అని ఎలీజా తేల్చి చెప్పారు.

ఇది పెత్తందారుల కుట్ర..
”పార్టీ ఆదేశాలే నాకు శిరోధార్యం అని చెప్పా. అందువల్లే నాకు, వాళ్లకు గొడవైంది. అందువల్లే వాళ్లు నన్ను వ్యతిరేకించారు. నా పనితీరు బాగోలేదని ప్రజలు చెప్పాలి. పెత్తందారులు కాదు. ఐదేళ్ల కాలంలో నా పనితీరు బాగుందని చెప్పి.. ఎన్నికల వేళ మూడు నెలల కాలంలో పని తీరు బాగోలేదని చెప్పడం ఏంటో అర్థం కావడం లేదు. ఇది కుట్రపూరితంగా జరిగిన విషయం. కొంతమంది పెత్తందారులు కుట్రపన్ని నాకు ఇక్కడ సీటు వస్తే వారికి మనుగడ ఉండదని భయపడి నాకు సీటు రాకుండా అధిష్టానం దగ్గర మేనిపులేట్ చేశారు. ఒక పక్క అధిష్టానాన్ని మోసం చేశారు, మరోపక్క నన్ను కూడా చీట్ చేశారు. నాకు సీటు రాకుండా చేశారు. నేను ముందే చెప్పాను.

నేను వాళ్ల కాళ్లు మొక్కను..
నేను వాళ్ల కాళ్లు మొక్కను. నాకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మాత్రమే నేను బాధ్యుడిని. నాకు సీటు ఇచ్చి ఇక్కడికి పంపిన జగన్ కి బాధ్యుడిని. నేను ప్రజలకు, జగన్ కు సమాధానం చెప్పుకోవాలి. అంతేకానీ, మధ్యలో ఉన్న పెత్తందారులకు కాదు. పెత్తందారులకు ప్రజలతో సంబంధం లేదు. వాళ్లకు వాళ్ల స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం. వారి స్వార్ధానికి నేను పని చేయలేను కదా.

Also Read : ఆ 5 స్థానాలు టీడీపీకా? జనసేనకా? తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ

త్వరలోనే నా నిర్ణయం చెబుతా..
జంగారెడ్డి మున్సిపాలిటీలో వాళ్ల మనిషి ఛైర్మన్ కావాలని వాళ్లు కోరుకున్నారు. కానీ, జగన్ ఎవరి పేరు చెప్పారో వారి పేరు నేను పంపాను. జగన్ ఏం చెబితే అదే నేను చేశాను. అంతేకానీ, పెత్తందారులకు అనుగుణంగా పని చేయలేను. నేను మోసపోయాను, పార్టీ నన్ను మోసం చేసింది. పార్టీ ఇవాళ నన్ను రోడ్డున నిలబెట్టింది. నన్ను నమ్ముకుని ఈ ఐదేళ్లు నాతో నడిచిన వాళ్లు ఉన్నారు. వ్యక్తులు, కార్యకర్తలు, అభిమానులు, సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్లందరితో సమాలోచనలు చేసి వారి సూచనలు, సలహాల మేరకు నిర్ణయం తీసుకుంటాను” అని ఎమ్మెల్యే ఎలీజా హాట్ కామెంట్స్ చేశారు.

నిన్న వైసీపీ మూడో లిస్టు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో చింతలపూడి అసెంబ్లీ స్థానం కూడా ఉంది. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజాకు జగన్ టికెట్ నిరాకరించారు. ఎలీజా స్థానంలో నియోజకవర్గ ఇంఛార్జిగా కుంభం విజయరాజును నియమించారు జగన్. ఈ క్రమంలో చింతలపూడిలో నియోజకవర్గంలో వైసీపీ వర్గాల్లో రాజకీయం వేడెక్కింది. ఎలీజాకు టికెట్ నిరాకరించడంతో కార్యకర్తలు కొంత కోపంగా ఉన్నారు. కాగా, అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఎలీజాకు సూచించింది. అందుకు ఎలీజా నిరాకరించారు. చింతలపూడి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని అంటున్నారు.

నేను ఏం తప్పు చేశానో అధిష్టానం చెప్పకుండానే తనకు టికెట్ నిరాకరించడం బాధాకరం అంటున్నారు ఎమ్మెల్యే ఎలీజా. తనను ఇలా రోడ్డున పడేయటం కరెక్ట్ కాదంటున్నారు. దీనిపై సమాధానం చెప్పాలని పార్టీ పెద్దలను ఆయన అడుగుతున్నారు.