Mudragada Padmanabham: ఎన్నికల వేళ రాజకీయాన్ని తనవైపు తిప్పుకున్న ముద్రగడ
గత ఎన్నికల తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ... గత ఏడాది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సమయంలో లేఖాస్త్రాలతో సంచలనం సృష్టించారు.

Mudragada Padmanabham
ఆయనో సీనియర్ నేత… అలాగని రాజకీయాలను మాత్రం సీరియస్‌గా తీసుకోని నాయకుడు. కానీ ఆయన ఆశీస్సులు… అండదండల కోసం అన్ని పార్టీల నేతలూ ప్రయత్నిస్తుంటారు. ఏ పార్టీ కూడా ఆయనను లైట్‌గా తీసుకోదు. అలా అని హత్తుకుని తమతో ఉన్నాడని చెప్పుకోదు. రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఆయన చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఇంతకీ ఎవరా నేత.. ఏంటి ఆయన ప్రత్యేకత ? తెలుసుకుందాం రండి.
ముద్రగడ పద్మనాభం. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సీనియర్ రాజకీయ నేత. కాపు ఉద్యమకర్త. తన కులం కోసం.. తన వారి శ్రేయస్సు కోసం రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కులంలో పట్టు సాధించారు. కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ఆ సామాజిక వర్గంలో తనదైన ముద్ర వేసుకున్న ముద్రగడ… రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను తడబాట్లను ఎదుర్కొంటున్నారు. 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్నా.. స్పష్టమైన రాజకీయ ఆకాంక్షలు ఉన్నా.. ఎందుకనో వర్తమాన రాజకీయాలలో తనదైన ముద్ర వేయలేకపోతున్నారు పద్మనాభం.
ఎవరు ఏమన్నా ముద్రగడ అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉందనేది సుస్పష్టం. అలా అని ఏ పార్టీ కూడా ముద్రగడను చేర్చుకునేందుకు గానీ.. ఆయనకు తమ పార్టీ టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలోకి దింపడానికి గానీ సాహసించడం లేదు. ముద్రగడ తమ పార్టీ తరఫున పోటీ చేస్తే ఓ కులం ముద్ర తమపై పడిపోతుందని.. మిగతా కులాలు దూరమైపోతాయనే భయమే దీనికి కారణమనే వాదన వినిపిస్తుంది. ఇలా చెప్పడానికి ఇటీవల జరిగిన.. జరుగుతున్న పరిణామాలను ఉదాహరణగా చెబుతున్నారు పరిశీలకులు.
లేఖాస్త్రాలతో సంచలనం
గత ఎన్నికల తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ… గత ఏడాది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సమయంలో లేఖాస్త్రాలతో సంచలనం సృష్టించారు. పవన్‌ను టార్గెట్ చేస్తూ అధికార వైసీపీకి దగ్గర వ్యక్తిలా కనిపించారు. కాపు ఉద్యమానికి… కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి సాయం చేశారనే వ్యాఖ్యలతో విమర్శల పాలయ్యారు.
ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారో గానీ, ముద్రగడ గానీ.. ఆయన కుమారుడు గిరి పిఠాపురం లేదా ప్రత్తిపాడు నియోజకవర్గాల నుంచి వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారనే టాక్ వినిపించింది. కానీ ప్రస్తుతం ఆ నియోజకవర్గాలకు వైసీపీ అభ్యర్థులుగా వేరేవారిని ప్రకటించడంతో ముద్రగడపై వచ్చినవన్నీ పుకార్లేనని తేలిపోయాయి.
ఇదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్‌కు ముద్రగడ లేఖలు రాయడం.. ఈ ఇద్దరి మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయనే సంకేతాలను ఇస్తోంది. మరోవైపు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడతో మాటామంతీ కలపడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో జనసేన, టీడీపీ నేతలు ముద్రగడతో మాటలు కలపక ముందు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త మిథున్‌రెడ్డి కూడా ముద్రగడను కలిశారనే ప్రచారం ఒకటుంది. ఇవన్నీ పరిశీలిస్తే ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ముద్రగడతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లే కనిపిస్తోంది.
ఎంపీగా, మంత్రిగా..
ప్రతి రాజకీయ పార్టీ ముద్రగడతో మంచి సంబంధాలు కోరుకుంటూనే రాజకీయంగా ఆయనను అవసరానికి వాడుకుని వదిలేస్తున్నాయనే భావన ఆ సామాజిక వర్గంలో కనిపిస్తోంది. 1978లో రాజకీయాల్లో ప్రవేశించిన ముద్రగడ ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. 2014-19 మధ్య కాపు ఉద్యమంతో రాజకీయాన్ని తన చుట్టూ తిప్పుకున్నారు. 2019 తర్వాత గత ఏడాది వరకు రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయని ముద్రగడ… జనసేనానికి రాసిన లేఖల ద్వారా మళ్లీ తన ఉనికిని చాటుకున్నారు. కానీ, రాజకీయంగా ఆయన ఎలాంటి లేకపోవడంతో అభిమానులు గందరగోళంలో పడిపోయారు.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు రాష్ట్రంలో ఓ వర్గం ముద్రగడ రాజకీయ భవిష్యత్ గురించి, ఆయన తీసుకోబోయే నిర్ణయాల గురించి ఆసక్తిగా గమనిస్తుంటుంది. కానీ, గత రెండు మూడు పర్యాయాల నుంచి పార్టీలు ముద్రగడను వాడుకుని వదిలేస్తున్నట్లు ఉందని ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో కూడా ముద్రగడతోపాటు ఆయన కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది.
ఇన్నాళ్లు ముద్రగడ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారని… ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగితే.. ఇప్పడు టీడీపీ, జనసేన కూటమి నుంచి స్నేహహస్తం అందిస్తున్నట్లు కనిపిస్తుండటంతో మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు ముద్రగడ. మరి తాజా రాజకీయ పరిణామాలైనా ముద్రగడకు అనుకూలంగా మారతాయో లేదో వేచి చూడాల్సిందే.
వైసీపీ అలర్ట్.. రంగంలోకి కీలక నేతలు, ముద్రగడ పద్మనాభంకు బుజ్జగింపులు