ఆ 5 స్థానాలు టీడీపీకా? జనసేనకా? తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ
పొత్తులో భాగంగా ఇరు పార్టీలకు సీట్ల కేటాయింపు అత్యంత కీలంకగా మారింది. నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ను నడిపించే బలమైన నాయకుడు, సామాజిక సమీకరణాలు, రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

East Godavari TDP And Janasena Candidates
East Godavari : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేన అభ్యర్థుల ఎంపిక అత్యంత కీలకంగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రభావం చూపించేలా మారారు. దీనికి తోడు టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన సీట్లు అడుగుతుండటంతో ఎంపిక కష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే రెండు పార్టీల అధ్యక్షులు రీ సర్వేకు సిద్ధమయ్యారు. ఇందులో ఏ పార్టీకి ఏయే స్థానాలు.. ఎక్కడ ఎవరికి టికెట్లు దక్కుతాయనేది ఉత్కంఠగా మారింది.
6 నుంచి 8 స్థానాల్లో జనసేన పోటీ..!
రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నింటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అత్యంత ప్రధానమైంది. అధికార వైసీపీ ఇప్పటికే జిల్లాలోని అభ్యర్థులను దాదాపు ఖరారు చేయడంతో టీడీపీ-జనసేన కూడా క్యాండిడేట్స్‌ను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. పొత్తులో భాగంగా ఇరు పార్టీలకు సీట్ల కేటాయింపు అత్యంత కీలంకగా మారింది. నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ను నడిపించే బలమైన నాయకుడు, సామాజిక సమీకరణాలు, రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 6 నుంచి 8 స్థానాల్లో జనసేన పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులోని 5 సెగ్మెంట్లలో జనసేనతో పాటు టీడీపీ అభ్యర్థులు కూడా బలంగా ఉన్నారు. రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురం, మండపేట, కొత్తపేట నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేనకు క్యాడర్‌తో పటు బలమైన అభ్యర్థులున్నారు.
రాజమండ్రి రూరల్ లో ఇద్దరూ బలమైన అభ్యర్థులే..
రాజమండ్రి రూరల్‌లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఉన్నారు. ఇక్కడి నుంచి రెండుసార్లు గెలుపొంది బలమైన అభ్యర్థిగా ఉన్న గోరంట్ల.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ వేవ్ ఉన్న సమయంలోనూ ఈ సెగ్మెంట్‌లో టీడీపీ జెండా ఎగురవేశారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న కందుల దుర్గేశ్.. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సెగ్మెంట్‌లో టీడీపీతోపాటు జనసేన కూడా బలంగా ఉంది. సమస్యలపై పోరాటం చేడయంతో పాటు క్యాడర్‌ను కాపాడుకోవడంలో దుర్గేశ్ కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇక్కడి నుంచి తాను బరిలో ఉంటానని.. ఈ విషయంలో పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తనకు అండగా ఉన్నారని చెబుతున్నారాయన.
Also Read : గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇప్పుడిదే విజయ రహస్యం, ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న ఫీల్ ఫ్యాక్టర్
కాకినాడ రూరల్ టికెట్ ఆశిస్తున్న నానాజీ
ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాపులతో పాటు బీసీ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ బీసీ వర్గానికి చెందిన పిల్లి సత్తిబాబు భార్య పిల్లి అనంతలక్ష్మి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటి నుంచి ఈ సెగ్మెంట్‌లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. జనసేన నుంచి పీఏసీ సభ్యుడు పంతం నానాజీ టికెట్ ఆశిస్తున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఈయన.. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ టీడీపీ-జనసేనకు చెందిన ఇద్దరు అభ్యర్థులు బలమైన క్యాడర్‌తో ముందుకు సాగుతున్నారు.
పిఠాపురం నుంచి బరిలోకి పవన్ కల్యాణ్?
కాపు ప్రభావిత నియోజకవర్గమైన పిఠాపురం సీటు విషయంలో జనసేన పార్టీలో చర్చ జోరుగానే సాగుతోంది. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని స్థానిక నేతలు భావిస్తున్నారు. అయితే.. ఈ సెగ్మెంట్‌లో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న SVSN వర్మ.. నాలుగున్నరేళ్ల నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటూ వస్తున్నారు. ఇక పిఠాపురం జనసేన ఇన్‌చార్జిగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఉన్నా… కార్యకర్తలతో సమన్వయం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే.. పూర్తిస్థాయిలో సహకరిస్తామని వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ పవన్‌కు కాకుండా వేరే ఎవరికైనా టికెట్ ఇస్తే మాత్రం.. స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని వర్మ తన అనుచరులకు చెప్పినట్లు సమాచారం.
Also Read : సంపదంతా వాళ్ల చేతుల్లోకే వెళ్తుంది..! ప్రస్తుత రాజకీయాలపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
టీడీపీ కంచుకోటలో అభ్యర్థి ఎవరు?
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ-జనసేన అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న మండపేట నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వరుసగా మూడుసార్లు గెలిచారు. ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేసేందుకు వేగుళ్ల సిద్ధమవుతుండగా.. జనసేన నుంచి వేగుళ్ల లీలాకృష్ణ సైతం పోటీ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఇక్కడి ముఖ్య నేతలు.. ఇరువురి మధ్య సఖ్యత కుదిర్చి జనసేన అభ్యర్థిని బరిలో దింపే యోచన చేస్తున్నారు. వైసీపీ నుంచి తోట త్రిమూర్తులు పోటీ చేయనున్న నేపథ్యంలో.. ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
కొత్తపేటలో టికెట్ ఆశిస్తున్న అన్నదమ్ములు..
ఇక కొత్తపేట నియోజకవర్గంలో అన్నదమ్ములిద్దరూ టీడీపీ-జనసేన నుంచి ఆశావహుల లిస్టులో ఉన్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం, జనసేన నుంచి బండారు శ్రీనివాస్ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సెగ్మెంట్‌లో రెండు పార్టీలకు క్యాడర్‌తో పాటు.. అభ్యర్థులిద్దరూ బలంగానే ఉన్నారు.
మొత్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఈ ఐదు స్థానాలు టీడీపీకి దక్కుతాయా ? లేదా జనసేన అభ్యర్థులు బరిలో నిలుస్తారా ? అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలోనే ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రీ సర్వేలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో తలమునకలయ్యారు.