Daggubati Venkateswara Rao : సంపదంతా వాళ్ల చేతుల్లోకే వెళ్తుంది..! ప్రస్తుత రాజకీయాలపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంకోసం నిజంగా ఫైట్ చేసేవారిని కాపాడాలి, ప్రస్తుత ట్రెండ్ సాగిస్తున్న మిగతా వారిని రాజకీయాల నుండి బయటికి పంపి దూరం చేయాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

Daggubati Venkateswara Rao,
Daggubati : మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకుల మర్రు గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన స్మశానవాటిక, హల్త్ క్యాంపు ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పార్టీలు, నాయకుల పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ. 30 నుంచి రూ. 40 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా ఎమ్మెల్యే సంపాదించుకునేది శూన్యం అన్నారు. టికెట్ రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు నా దృష్టిలో చాలా అదృష్టవంతులని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉత్సవ విగ్రహాలుగా చేసి, సంపదంతా పార్టీ అధిపతుల వద్దకు చేర్చుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రజలకు సేవచేసే అవకాశం లేదంటూ దగ్గుబాటి అన్నారు.
Also Read : Keshineni Nani : వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా బరిలోకి కేశినేని నాని?
ఇదివరకు ఎమ్మెల్యేలు సంపాదించుకున్నారేమో కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధినేతలే ఇసుక, మద్యం, మట్టిలో దండుకుంటున్నారు. భారతదేశంలో సింగిల్ మ్యాన్ఉన్న పార్టీలన్నీ ఇదే విధంగా చేస్తున్నాయంటూ దగ్గుబాటి అన్నారు. ఓడిన ఎమ్మెల్యే అక్కడే ఏడుస్తున్నాడు.. గెలిచిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఏడుస్తున్నాడూ.. ప్రస్తుత రాజకీయాల్లో ఇదే తేడా. సంపాదించుకున్న ఆ డబ్బుతో ప్రస్తుతం పోటీ చేయడమంటే వారి పిల్లలను రాజకీయ నాయకులు రోడ్డున పడేయడమే అంటూ దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంకోసం నిజంగా ఫైట్ చేసేవారిని కాపాడాలి, ప్రస్తుత ట్రెండ్ సాగిస్తున్న మిగతా వారిని రాజకీయాల నుండి బయటికి పంపి దూరం చేయాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.