Minister Ponnam Prabhakar : కాళేశ్వరంపై కేంద్రం ఏం చేస్తోంది..? కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై పొన్నం సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎంపీ వినోద్ కుమార్ సచ్చీలుడైతే తనపై వచ్చిన ఆరోపణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పొన్నం సూచించారు.

Minister Ponnam Prabhakar
Minister Ponnam : కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ అనగానే బీఆర్ఎస్ నేతల్లో దడ పుడుతుందని, లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు తొమ్మిది నెలలు కూడా పనిచేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బుధవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.. ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పామని అన్నారు. అవినీతి చేయనప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ అని పొన్నం ఆరోపించారు. కాళేశ్వరంపై కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. బండి సంజయ్ కు ఏం తెలువదన్న పొన్నం.. సంజయ్ ఓ డ్రామా ఆర్టిస్టు అంటూ విమర్శించారు. ఐదేళ్లుగా కరీంనగర్ కు ఆయన ఏం చేశాడని పొన్నం ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలరోజులు అవుతుంది.. గ్యారెంటీ స్కీమ్ లపై దరఖాస్తులు స్వీకరించామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సచ్చీలుడైతే తనపై వచ్చిన ఆరోపణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పొన్నం సూచించారు. జెన్ కో తోపాటు ఇతర డిపార్ట్మెంట్ లో అక్రమంగా ఉద్యోగం పొందిన వారు వెంటనే ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళాలని పొన్నం సూచించారు. భూ అక్రమాలపై చర్యలు చేపడుతామని చెప్పారు.