Charminar Express : నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌.. పలువురు ప్రయాణికులకు గాయాలు

చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్.. ప్లాట్‌ఫాం సైడ్‌ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Charminar Express : నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌.. పలువురు ప్రయాణికులకు గాయాలు

Charminar Express

Updated On : January 10, 2024 / 10:33 AM IST

Trainaccident : నాంపల్లిలో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం వద్దకు చేరుకోగానే పట్టాలు తప్పింది. ఒక్కసారిగా కుదుపుకు గురై ప్లాట్‌ఫాం సైడ్‌ గోడలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రైలు డోర్ల దగ్గర నిలబడిన మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కొంతమందికి భయంతో గుండెపోటు రావడంతో వారిని లాలాగూడ రైల్వే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటన బుధవారం ఉదయం 9.15 గంటలకు చోటుచేసుకుంది. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కేకలువేస్తూ ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశారు. రైల్వే పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

Also Read : Train Accident : ఇటలీలో ఘోర ప్రమాదం… ఒకదానికొకటి ఢీకొన్న రెండు రైళ్లు

నాంపల్లి రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం ఘటనపై దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపింది. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్లు సమాచారం. దీంతో డెడ్ ఎండ్ లైన్ ప్రహరికి చార్మినార్ ఎక్స్ ప్రెస్ తాకింది. ఈ ప్రమాదంలో ఎస్ -1, ఎస్-2, ఎస్-3 మూడు బోగీలు పట్టాలు తప్పాయి.

నాంపల్లి రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం ఘటనపై హైదరాబాద్ ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని సూచించారు. అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.