Durgamma Temple
Durgamma Temple : బెజవాడ కనకదుర్గమ్మ గుడికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్న కారణంతో ఏపీసీపీడీసీఎల్ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. దేవస్థానానికి భక్తుల నుంచి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా దుర్గగుడికి ఇలాంటి పరిస్థితి రావడంపై అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : AP Government : ఏపీలోని రైతులకు శుభవార్త.. కూటమి ప్రభుత్వం బిగ్ డెసిషన్.. ఉచిత పంపిణీ
విజయవాడ దుర్గగుడికి విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.3.08 కోట్లుగా ఉన్నాయంటూ ఏపీసీపీడీసీఎల్ (APCPDCL) అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. 2023 ఫిబ్రవరి నుంచి బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ చెబుతుండగా, బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో హెచ్‌టీ లైన్ నుంచి విద్యుత్‌ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ చర్యపై దేవస్థానం భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. అయితే, భక్తులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
అలాగే తమ సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వినియోగిస్తున్నామని పేర్కొంటూ, నెట్ మీటరింగ్ కోసం విద్యుత్ శాఖను పలుమార్లు కోరినప్పటికీ సాంకేతిక కారణాలంటూ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను APCPDCL నమోదు చేయలేదని దేవస్థానం ఆరోపించింది.
విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని శుక్రవారం సాయంత్రమే దుర్గగుడి ఈవోకు సమాచారం ఇచ్చినట్లు విద్యుత్ అధికారులు వెల్లడించారు