PSR Anjaneyulu: పీఎస్ఆర్ ఆంజనేయులుకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలించిన సీఐడీ అధికారులు.. విచారణ వాయిదా..

ఇవాళ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పీసీఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు విచారించాల్సి ఉంది. కానీ..

PSR Anjaneyulu

PSR Anjaneyulu: ముంబయి నటి కాదంబరీ జెత్వానీకి వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు రిమాండు విధించడంతో ఆయన్ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే, ఈనెల 25న విజయవాడ కోర్టు మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంజనేయులను ఆదివారం సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

Also Read: AP Mega DSC: ఏపీలో డీఎస్సీకి అప్లయ్ చేస్తున్నారా.. అయితే, వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈ కేసులో కీలక విషయాలపై ఆంజనేయులును ప్రశ్నించి.. ఆయన నుంచి సమాచారం రాబట్టి స్టేట్ మెంట్ రికార్డ్ చేయాలని సీఐడీ అధికారులు భావించారు. కానీ, అనూహ్యంగా ఆంజనేయులు ఇవాళ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పీఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రి వద్దకు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం సీఐడీ కార్యాలయానికి పీసీఆర్ ను సీఐడీ పోలీసులు తీసుకెళ్లారు.

Also Read: AP: ఏపీలో దారుణం.. తల్లిదండ్రులను ట్రాక్టర్ తో వెంబడించి.. తొక్కించి హత్యచేసిన కొడుకు..

వాస్తవానికి ఇవాళ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పీసీఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు విచారించాల్సి ఉంది. హైబీపీ ఉండటంతో ఇవాళ విచారణను వాయిదా వేశారు. దీంతో మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు ఆయన్ను సీఐడీ అధికారులు తరలించారు. ఆయన నిన్నటి నుంచి హైబీపీతో ఇబ్బందిపడుతున్నట్లు తెలిసింది. దీంతో నిబంధనలు ప్రకారం విచారణ చేయడం కుదరదని భావించిన సీఐడీ అధికారులు.. ఆయన్ను తిరిగి జైలుకు తరలించారు.

 

పీఎస్ఆర్ ఆంజనేయులు తరపు న్యాయవాది విష్ణువర్దన్ మాట్లాడుతూ.. జైల్లో పీఎస్ఆర్ ని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. విచారణకు సహకరిస్తానని చెబుతున్నా కావాలనే పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. బీపీ ఎప్పుడూ అప్ అండ్ డౌన్ వస్తుందని, విచారణకు సహకరిస్తారని పీఎస్ఆర్ చెబుతున్నారని, పోలీసులు కావాలనే విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారని విష్ణువర్దన్ అన్నారు. జైల్లోసైతం ఇబ్బందులు పెడుతున్నారని పీఎస్ఆర్ మాకు చెప్పారని, ఇప్పుడు ఎక్కడా లేని రూల్స్ సైతం జైల్లో అమలు చేస్తున్నారని న్యాయవాది విష్ణువర్దన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.