Rain alert
Rain Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఒకవైపు చలి జనాలను వణికిస్తోన్న నేపథ్యంలో, మరోవైపు వర్షాలు దంచికొట్టనున్నాయి. అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. (Rain Alert)
బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఇది పశ్చిమ -వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తుంది. తరువాత అదే దిశలో పయణిస్తూ.. బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అయితే, ఈ కారణంగా ఏపీలో రాబోయే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని.. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏపీలో నేడు (శనివారం) పలు ప్రాంతాల్లో వర్షం పడనుంది. ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు.. అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. తుపాను తీవ్రత తగ్గే వరకు చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
వర్షాల దృష్ట్యా వరి కోతలుసహా వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులకు విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే పండిన ధాన్యాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని స్పష్టం చేసింది.