Ration
Ration card – Aadhaar Card : కరోనా కాలం.. భౌతిక దూరం పాటించక తప్పని పరిస్థితులు.. థర్డ్ వేవ్ భయాలతో చిన్నారులను సురక్షితంగా ఉంచేందుకు ఇంతకాలం స్కూళ్లు సైతం తెరవలేదు. అయినా సరే పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు తెల్లవారుజామునే ఆధార్-EKYC సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ఆధార్, రేషన్ కార్డు అనుసంధానం కాకపోతే.. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కరోనా కాలంలో అసలే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వేళ.. రేషన్ ఆగిపోతే మరింత దుర్భర పరిస్థితులు ఎదురవుతాయని భయపడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఈ విధమైన దుస్థితి నెలకొంది. రేషన్ కార్డును.. కుటుంబ సభ్యులందరి ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న ప్రభుత్వ నిబంధనతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.
Read More : WhatsApp : లింక్ పంపుతారు..ఓటీపీ చెప్పమంటారు..తర్వాత, హైదరాబాద్‌లో మరో మోసం
ఇప్పటిదాకా కుటుంబ పెద్ద ఆధార్‌ను రేషన్‌తో అనుసంధానం చేసి.. బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేసేవారు. కార్డుల్లో ఉన్న పేర్లు ఆధారంగా సంఖ్యను బట్టి కుటుంబానికి రేషన్ కేటాయించేవారు. అయితే ఇంటిపెద్ద పేరు మాత్రమే కాకుండా పిల్లా, పెద్దా తేడా లేకుండా కుటుంబంలో ఉన్న వారందరి ఆధార్‌కార్డులు.. రేషన్ కార్డుకు అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కుటుంబంలోని పెద్దలు ఆధార్‌ను రేషన్‌తో అనుసంధానం చేయించుకోవడానికి ఈ నెల 20ని గడువుగా ప్రకటించింది. పిల్లలకు సెప్టెంబరు 30 వరకు గడువు ఉంది. వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి ఆధార్ – EKYC చేయాలని ప్రభుత్వం ఆదేశించినా.. చాలా చోట్ల అది అమలు కావడం లేదు. ప్రజలే ఆధార్ కేంద్రాలు, బ్యాంకుల దగ్గర ఎదరుచూపులు చూస్తున్నారు.
Read More : Petrol Rate : 33 రోజులుగా స్థిరంగా పెట్రోల్ ధరలు
తెల్లవారుజామునుంచే ఆధార్ కేంద్రాలకు జనం తరలివస్తున్నారు. కూర్చోడానికి వసతులు లేకపోవడంతో.. గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఈ క్రమంలో ఒకరితో ఒకరు గొడవలు పడుతున్నారు. కొన్ని చోట్ల ఇది తొక్కిసలాటకు దారితీస్తోంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి అదుపులోకి తీసుకురావాల్సి వస్తోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఇదే పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో చిన్నారులు, బాలింతలు కూడా క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తోంది. కోరి.. కరోనా తెచ్చుకుంటున్నట్టుగా పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Read More : AP EAPCET : ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్
రేషన్, ఆధార్ అనుసంధానానికి గడువు విధించిన ప్రభుత్వం…సరిపడా ఏర్పాట్లు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని సెంటర్లు మాత్రమే అందుబాటులో ఉండడం, ఒక్కో సెంటర్‌లో 40 మందికి మాత్రమే అనుసంధానం చేసే వీలుండడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆధార్, రేషన్ అనుసంధానం బాధ్యతను గ్రామ సచివాలయాలకు అప్పగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.