Ravulapalem Gun Firing : కలకలం రేపిన రావులపాలెం కాల్పుల ఘటనలో కొత్త కోణాలు.. అసలు వివాదం ఇదే..!

అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్థరాత్రి కాల్పులపై పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. క్లూస్ సేకరించి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

Ravulapalem Gun Firing : కలకలం రేపిన రావులపాలెం కాల్పుల ఘటనలో కొత్త కోణాలు.. అసలు వివాదం ఇదే..!

Updated On : September 5, 2022 / 7:03 PM IST

Ravulapalem Gun Firing : అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్థరాత్రి కాల్పులపై పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. క్లూస్ సేకరించి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. రావులపాలెం హైవేకు ఆనుకుని ఉన్న రవాణాశాఖ కార్యాలయంపై ఫైనాన్షియర్ గుడిమెట్ల ఆదిత్యరెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటి మెట్లపై కాపు కాచిన దుండగులు.. రాత్రి 10గంటలకు ఆదిత్య రెడ్డి ఇంట్లోకి వెళ్తుండగా.. దాడి చేశారు. అయితే గన్ ఫైరింగ్ గాల్లోకి జరగడంతో ప్రాణాపాయం తప్పింది.

రాత్రికి తన ఇంటికి సమీపంలోనే ఉన్న ఇండస్ట్రియల్ యూనిట్ నుంచి వచ్చిన ఆదిత్య రెడ్డి ఫ్రెండ్స్ తో కలిసి బల్లపై కూర్చుని ఉన్నారు. రాత్రి 10గంటలకు అంతా వెళ్లిపోయాక ఇంట్లోకి వెళ్లేందుకు ఆదిత్య రెడ్డి మెట్లు ఎక్కుతుండగా..గుర్తు తెలియని వ్యక్తులు గమనించారు. మీరు ఎవరు అని ఆదిత్యరెడ్డి ప్రశ్నించగా.. వారు గన్ గురి పెట్టారు. వెంటనే అప్రమత్తమైన ఆదిత్య రెడ్డి వారిని ప్రతిఘటించాడు. దీంతో ఒక బుల్లెట్ గాల్లోకి పేలింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి ఇంటి నుంచి బయటకు వచ్చారు ఆదిత్యరెడ్డి భార్య, తల్లి. గట్టిగా కేకలు వేయడం, కాల్పుల శబ్దానికి స్థానికులు కూడా బయటకు వచ్చారు.

అప్పటికి ఇంకా ఆదిత్యరెడ్డి దుండగులతో పోరాడుతూనే ఉన్నాడు. ఒక దుండగుడు రెండోసారి కాల్పులు జరిపేందుకు యత్నించగా, ఆ గన్ లాక్కున్నాడు. ఇంతలో గన్ కింద పడిపోయింది. కిందపడ్డ గన్ ను మరో దుండగుడు లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. కానీ, అప్పటికే గన్ మ్యాగజీన్ కింద పడిపోయింది. అదే సమయంలో పాన్ షాప్ ఓనర్ కర్ర తీసుకుని వచ్చాడు. ఇది గమనించిన దుండగులు చెరోవైపు పారిపోయారు.
దుండగుల దాడిలో ఆదిత్యరెడ్డి చేతి వేలు, నుదుటికి గాయాలయ్యాయి. దుండగులు గన్ తో పాటు జామర్, నాటు బాంబులతో వచ్చారు. నాటుబాంబులు ఉన్న బ్యాగును అక్కడే వదిలేసి పారిపోయారు. రాత్రి 10.20 నిమిషాలకు కాల్పులు జరగ్గానే ఆదిత్యరెడ్డి సోదరుడికి ఫోన్ చేశారు బంధువులు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్పాట్ కి వచ్చారు. ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

అంబాజీపేట మండలం కె.పెదపూడికి చెందిన నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు సోదరులకు 9 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను ఉంచుకుని 4 కోట్ల 70 లక్షల రూపాయలు అప్పు ఇచ్చారు ఆదిత్యరెడ్డి తండ్రి గుడిమెట్ల సత్యనారాయణ రెడ్డి. రెండు నెలల క్రితం సత్యనారాయణరెడ్డి మృతి చెందారు. అయితే, పత్రాలను ఉంచుకుని ఫైనాన్స్ చేసిన భూమిలో ఇటీవల 69.5 సెంట్లు విక్రయించేందుకు అదే ప్రాంతానికి చెందిన వారితో అగ్రిమెంట్ చేసుకున్నారు ఆదిత్యరెడ్డి. దీంతో 9 ఎకరాల భూమి యజమానులు, అదే భూమిపై అగ్రిమెంట్ చేసుకున్న వెంకటకృష్ణారెడ్డి, ఆదిత్యరెడ్డి మధ్య వివాదం మొదలైంది. ఈ కారణంతోనే రాత్రి ఆదిత్య రెడ్డిపై దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఫైనాన్షియర్ ఆదిత్య రెడ్డి ఇంటి వద్ద దుండగులు మూడు రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నారు. దీంతో ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు బిగించాడు ఆదిత్య రెడ్డి. అయితే ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు. ఇంతలోనే రాత్రి 9 గంటలకు మరోసారి రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత ఆదిత్య రెడ్డి రాకతో ఒక్కసారిగా కాల్పులు జరిపారు దుండగులు.

రాత్రి ఇంటి మెట్లు ఎక్కుతుండగా కరెంట్ పోయిందని, అదే సమయంలో దుండగులు గన్ గురి పెట్టారని ఆదిత్య రెడ్డి వాపోయాడు. వారిని గట్టిగా ప్రతిఘటించడంతో గన్ మ్యాగజీన్ కింద పడిపోయిందని, దాంతో రెండోసారి కాల్పులు జరపకలేకపోయారని తెలిపారు. ఇప్పటికీ తన కుటుంబసభ్యులు భయంతోనే ఉన్నారని ఆదిత్య రెడ్డి వాపోయారు.