టికెట్‌ దక్కదని భావించే బాలినేని రివర్స్ గేమ్‌ స్టార్ట్ చేశారా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే సమాయత్తం

ఎన్నికల నాటికి మార్కాపురం, గిద్దలూరు, దర్శిలలో కూటమి అధిష్టాన పెద్దల అంచనాలకు తగ్గట్లు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీల తీరు లేకపోతే..ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి బాలినేనిని బరిలోకి దింపుతారన్న టాక్ వినిపిస్తోంది.

Balineni Srinivasa Reddy

ఒకప్పుడు ఆయన వైసీపీ అధినేత జగన్‌కు సన్నిహితుడు. పైగా బంధువు. పార్టీ పవర్‌లో ఉన్నప్పుడే అప్పుడప్పుడు అసంతృప్తి గళం వినిపించిన ఆయన..వైసీపీ ఓడిపోయాక ఫ్యాన్ స్విచ్ఛాఫ్‌ చేసి కూటమి గూటికి చేరారు. జనసేనలో చేరాక..జగన్‌ మీద విమర్శల దాడి చేయడానికి కూడా వెనకాడటం లేదు. అయితే బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని జనసేనలో చేర్చుకోవడంపై..ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ అసంతృప్తి గళం వినిపించారు.

అప్పట్లో ఫ్లెక్సీలు చిప్పుకోవడం..గ్రూప్‌ వార్‌ వంటివి రచ్చకు దారితీశాయి. ఆ తర్వాత ఒంగోలు పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. లేటెస్ట్‌గా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేసిన ప్రకటన చర్చకు దారితీస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఒంగోలు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, ఒకవేళ జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలో ఉంటానని స్పష్టం చేశారు.

Also Read: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ రచ్చ.. మొదట కవిత.. ఇప్పుడు సీఎం రమేశ్.. ఏం జరుగుతోంది?

ఈ మధ్య ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌, బాలినేని మధ్య విభేదాలు పీక్‌ లెవల్‌కు చేరాయట. వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందంటున్నారు. ఇదే సమయంలో మార్కాపురంలో జరిగిన భారీ బహిరంగ సభకు బాలినేని హాజరడం, పవన్ కల్యాణ్ ఆయనపై ప్రశంసలు కురిపించడం చర్చకు దారితీసింది. తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యల వెనక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు.

జనసేన అధిష్టానం టికెట్ ఇవ్వకపోవచ్చన్న అంచనాలతోనే ఆయన అలర్ట్ అయ్యారన్న టాక్‌ వినిపిస్తోంది. ఇండిపెండెంట్‌గానైనా బరిలో ఉంటానని ప్రకటించడాన్ని చూస్తుంటే..జనసేన పెద్దలు పిలిచి మాట్లాడాలన్నది బాలినేని వ్యూహమట. ఒకవేళ ఒంగోలులో కుదరకపోతే జిల్లాలో మరో సీటు అయినా ఇస్తామన్న హామీ కోసం ఆయన రివర్స్ గేర్ వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాజకీయంగా గందరగోళ పరిస్థితుల్లో బాలినేని
అయితే వైసీపీని వీడిన తర్వాత రాజకీయంగా బాలినేని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారట. 2026లో పునర్విభజనతో సీట్లు పెరుగుతాయని..ఒంగోలు నియోజకవర్గం రూరల్, సిటీగా విడిపోతుందని భావించారట. అలా ఎమ్మెల్యే దామచర్లతో పాటు తనకు టికెట్ దక్కుతుందని లెక్కలు వేసుకున్నారట బాలినేని. అయితే జనగణన పూర్తయ్యేంత వరకు నియోజకవర్గాల పునర్విభజనకు ఆస్కారం లేదని సుప్రింకోర్టు చెప్పడంతో జనసేనలో తన పరిస్థితి ఏంటనే దానిపై బాలినేని డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరగకపోతే..కూటమిలో బాలినేనికి ఒంగోలు టికెట్ దక్కడం కష్టమే. అయితే ఆయన్ను ఎక్కడైనా అకామిడేట్ చేయాలని భావిస్తే మరో నియోజకవర్గాన్ని పంపే అవకాశం ఉండొచ్చు.

అయితే నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే.. బాలినేనిని దర్శి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపొచ్చనే చర్చ కూడా నడుస్తోంది. అక్కడ రెడ్ల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండగా..కాపు, కమ్మ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్స్‌గా ఉన్నారు. దీంతో బాలినేనిని రంగంలోకి దింపితే కాపులు, కమ్మ, రెడ్డి ఓట్లతో ఈ సీటును ఈజీగా గెలుస్తామని లెక్కలు వేసుకుంటున్నారట. 2024 ఎన్నికల్లో దర్శి నుంచి కూటమి పార్టీ అభ్యర్ధిగా గొట్టిపాటి లక్ష్మీ బరిలో నిలిచి ఓడిపోయారు.

వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయకపోవచ్చని అంటున్నారు. మరోవైపు మార్కాపురం నియోజకవర్గంలో బాలినేని అరంగేట్రం చేయొచ్చనే టాక్ లేకపోలేదు. జిల్లా పశ్చిమ ప్రాంత నియోజకవర్గాల్లో కూటమి పార్టీకి చెప్పుకోదగ్గ మాస్ లీడర్, ఆర్థికంగా బలమైన నేత లేకపోవడంతో టీడీపీతో పాటు ఇటు జనసేనను కలవరపెడుతోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా తలపండిన బాలినేని లాంటి నాయకుడ్ని పశ్చిమ ప్రాంతం నుంచి రంగంలోకి దింపితే రాజకీయంగా పట్టు సాధించవచ్చనే భావన కూడా కూటమిలో పెద్దల్లో ఉందట. గిద్దలూరు అభ్యర్థిగా కూడా బాలినేని పేరు పరిశీలనలో ఉందంటున్నారు.

ఎన్నికల నాటికి మార్కాపురం, గిద్దలూరు, దర్శిలలో కూటమి అధిష్టాన పెద్దల అంచనాలకు తగ్గట్లు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీల తీరు లేకపోతే..ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి బాలినేనిని బరిలోకి దింపుతారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మూడు నియోజకవర్గాలు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న సెగ్మెంట్లు కావడంతో బాలినేని గెలుపు ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. మరి బాలినేని వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతుందా.? లేక ఆయన అన్నట్లే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాల్సి వస్తుందా అనేది వేచి చూడాలి.