బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ రచ్చ.. మొదట కవిత.. ఇప్పుడు సీఎం రమేశ్.. ఏం జరుగుతోంది?
అంతేకాదు విలీనం ఫైల్స్ నిజమేనా కూడా నేతలు ఆరా తీస్తున్నారట. ఒకవేళ బీఆర్ఎస్ విలీనం జరిగితే ఆ పార్టీ నేతలే ఎక్కువ మంది ఉంటారని..అలాంటప్పుడు తమకు అవకాశాలు దక్కే అవకాశం ఉండదని మధనపడుతున్నారు కమలనాథులు.

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం… తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడీ అంశం చుట్టే తిరుగుతోంది. మొదట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొదటిసారి ఈ టాపిక్‌ను తెరపైకి తెచ్చారు. తనను జైలు నుంచి విడిపించే సాకుతో బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం చేశారని చర్చకు దారి తీశారు కవిత. పార్టీని బీజేపీలో విలీనం చేయొద్దని, అవసరమైతే ఇంకొన్నాళ్లు జైలులోనైనా ఉంటానని కేసీఆర్‌కు చెప్పినట్లు కవిత చెప్పుకొచ్చారు.
కానీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని మాత్రం తాను ఒప్పుకోలేదన్నది కవిత వాదన. కేటీఆరే విలీనం కోసం ప్రయత్నించారన్న మీనింగ్ వచ్చేలా మాట్లాడారు కవిత. అప్పట్లోనే ఆమె కామెంట్స్‌పై పెద్దఎత్తున దుమారం లేచింది. విలీనం ప్రతిపాదనలో నిజం లేదంటూ బీఅర్ఎస్ లైట్ తీసుకుంది. కవిత కామెంట్స్‌పై రాజాసింగ్ రియాక్ట్ అయి..తమ నేతలు మంచి ప్యాకేజీ ఇస్తే ఎవరితోనైనా కలుస్తారంటూ బీజేపీ నేతలపై బాణాలు వదిలారు. అక్కడి వరకు ఆ ఎపిసోడ్ జరిగిపోయిన గతంగా ఉండిపోయింది. అంతలోనే సీఎం రమేష్ స్టేట్‌మెంట్‌తో విలీనం కథకు బలం చేకూరినట్లు అయింది.
Also Read: వైసీపీ కీలక మీటింగ్.. బిగ్ డెసిషన్స్ ఉంటాయా? త్వరలో వైసీపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయా?
కంచె గచ్చిబౌలి భూముల కోసం సీఎం రేవంత్..బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలతో..బీఆర్ఎస్ విలీనం టాక్స్ మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చాయి. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్..ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి చెప్పారని..ఆ ప్రతిపాదనను తాను బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్తే వాళ్లు ఒప్పుకోలేదంటున్నారు సీఎం రమేష్. కవితను వదిలేస్తే బీజేపీతో పొత్తు, విలీనం దేనికైనా రెడీ అని కేటీఆర్ అన్నారని బాంబ్ పేల్చారు.
అవసరమైతే తన ఇంటి సీసీ టీవీ ఫుటేజ్ ఇస్తానంటున్నారు సీఎం రమేష్. ఈ కామెంట్స్‌ను బీఆర్ఎస్‌తో పాటు కేటీఆర్ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో విలీనం చేయాలనుకుంటే డైరెక్ట్ మోదీతోనే డిస్కస్ చేస్తామని..సీఎం రమేష్‌తో రాయబారం ఎందుకు నడుపుతామంటూ రివర్స్ అటాక్ చేస్తోంది బీఆర్ఎస్. మొన్న సొంత పార్టీ ఎమ్మెల్సీ కవిత, ఇప్పుడు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కామెంట్స్‌తో..విలీనం టాక్స్ నిజమేనా అన్నది డిస్కషన్ పాయింట్‌గా మారింది.
వార్తలను ఖండిస్తున్నా..బీఆర్ఎస్‌లో మాత్రం అదే హాట్ టాపిక్
తెలంగాణ ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుందని కేటీఆర్ అంటున్నారు. బీఆర్ఎస్‌ను ఏ పార్టీలో కలిపే ముచ్చటే లేదని కరాఖండిగా చెబుతున్నారు. అయితే కేటీఆర్‌తో పాటు పలువురు నేతలు విలీనం వార్తలను ఎంత ఖండిస్తున్నా..బీఆర్ఎస్‌లో మాత్రం అదే హాట్ టాపిక్‌గా ఉంటుందట. నిప్పు లేనిదే పొగ రాదని..విలీనంపై ఏదో చర్చ జరిగే ఉంటుందని గుసగుసలు నడుస్తున్నాయట.
సరే ఇప్పటికైతే బీఆర్ఎస్ మెర్జింగ్ జరగలేదు గానీ..భవిష్యత్‌లో పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉందా..అని ఆరా తీస్తున్నారట పలువురు కారు పార్టీ లీడర్లు. ప్రస్తుతం ఏ ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కలిసినా ఇదే అంశంపైనే చర్చించుకుంటున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల టైమ్‌లో ఇలాంటి అంశం తెరపైకి రావడం బీఆర్ఎస్ నేతలను, క్యాడర్‌ను ఇరకాటంలో పడేసిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే విలీనం ప్రచారానికి చెక్ పెట్టకపోతే పార్టీకి తీవ్ర నష్టమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట.
బీఆర్ఎస్ విలీనం అంటూ ఎంపీ సీఎం రమేశ్ చేసిన కామెంట్స్‌పై బీజేపీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోందట. పెద్ద ప్యాకేజీ ఇస్తే బీజేపీ నేతలూ బీఆర్ఎస్‌తో కలిసిపోయేందుకు సిద్ధంగానే ఉన్నారంటూ గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు సీఎం రమేశ్ వ్యాఖ్యలతో కొందరు సీనియర్ లీడర్లు కూడా అంతర్మథనంలో పడినట్టు తెలుస్తుంది. ఆయన కామెంట్స్‌కు బలం చేకూర్చేలా బండిసంజయ్ ఉన్నాయని కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట. బీఆర్ఎస్, కాంగ్రెస్ పొలిటికల్ ఫైట్‌తో పాటు..సొంత పార్టీ నేతల కామెంట్స్‌తో స్యాండ్ విచ్ అయిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
అంతేకాదు విలీనం ఫైల్స్ నిజమేనా కూడా నేతలు ఆరా తీస్తున్నారట. ఒకవేళ బీఆర్ఎస్ విలీనం జరిగితే ఆ పార్టీ నేతలే ఎక్కువ మంది ఉంటారని..అలాంటప్పుడు తమకు అవకాశాలు దక్కే అవకాశం ఉండదని మధనపడుతున్నారు కమలనాథులు. ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌తో పొత్తు ఓకే కానీ..విలీనం చేసుకుంటే బీజేపీకే నష్టమన్న భావన మరికొందరు నేతల్లో ఉందట.
ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపిస్తున్న వేళ సీఎం రమేష్ కామెంట్స్ ఇంకా డైలమాలో పడేశాయని అంటున్నారట. విలీనంపై బీజేపీ అగ్రనేతలు క్లియర్ కట్‌గా చెప్పేయకపోతే పార్టీకి డ్యామేజ్ జరగొచ్చని లెక్కలు వేసుకుంటున్నారట ఇంకొందరు లీడర్లు. ఏదేమైనా విలీనం లీక్స్ అటు కారులో..ఇటు కమలంలో కాక రేపుతున్నాయనేది మాత్రం ఓపెన్ సీక్రెట్.