Uyyalawada Narasimha Reddy Airport : కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాల వాడ పేరు.. సీఎం జగన్ ఎందుకు పెట్టారో తెలుసా

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ పెట్టడం పట్ల రాయలసీమ వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎయిర్ పోర్టుకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరే ఎందుకు పెట్టారు? దాని వెనుక కారణం ఏంటి? అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.

Uyyalawada Narasimha Reddy Airport : కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్ పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ పెట్టడం పట్ల రాయలసీమ వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎయిర్ పోర్టుకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరే ఎందుకు పెట్టారు? దాని వెనుక కారణం ఏంటి? అసలు ఆయనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంతకీ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఎవరు? ఇప్పుడీ ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.

తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్తింపు పొందారు. ఆయన జీవిత కథతో ఇప్పటికే చిరంజీవి సైరా సినిమా చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడకు పాలెగాడిగా వ్యవహరించిన నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగానే సైరా నరసింహారెడ్డి సినిమా రూపొందించారు. సుదీర్ఘకాలం పాటు సాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో 1857 సిపాయిల తిరుగుబాటుకి ప్రత్యేక స్థానం ఉంది. అంతకు దశాబ్దకాలం ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తొలి స్వాతంత్ర్య పోరాట యోధుడిగా గుర్తింపు పొందారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర 170 ఏళ్ల కిందటిది. 1847లోనే ఆయన చనిపోయినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. నరసింహారెడ్డి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా పాలనను ఎదిరించారు. 1846లో బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు ప్రారంభించి సుమారు ఏడాది కాలంపాటు పోరాడారు. ఆ ఉద్యమానికి అనేక మంది తోడ్పడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సాగించిన ఈ తిరుగుబాటులో సుమారుగా 5 వేల మంది అనుచరులు ఆయనకు అండగా నిలిచినట్టు పరిశోధకులు చెబుతున్నారు. చివరికి 1847లో బ్రిటిష్‌వారు నరసింహారెడ్డిని బంధించి ఉరి తీసి, ఆయన శవాన్ని కోట గుమ్మానికి వేలాడ దీశారు.

సీమ వీరుడిగా ఉయ్యాలవాడ గుర్తింపు పొందారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సాగించిన పోరాటానికి గుర్తుగా.. ఆయనను గౌరవిస్తూ, నివాళులర్పిస్తూ కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఏపీ ప్రభుత్వం పెట్టినట్లు తెలుస్తోంది.

ఏపీలో మరో ఎయిర్ పోర్టు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన నూతన విమానాశ్రయాన్ని సీఎం జగన్ గురువారం(మార్చి 25,2021) ప్రారంభించారు. ఈ ఎయిర్ పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఎయిర్ పోర్టుగా నామకరణం చేశారు సీఎం జగన్. ఇదివరకు కర్నూలు నుంచి ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సు లేదా రైలులో వెళ్లాల్సి వచ్చేదని.. ఇప్పుడు విమానాల్లో వెళ్లే అవకాశం కలిగిందని జగన్ అన్నారు. రాష్ట్రంలో 6వ విమానాశ్రయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో న్యాయ రాజధాని కానున్న కర్నూలుకు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలతో అనుసంధానించడానికి ఓర్వకల్లు విమానాశ్రయం వారధిగా ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఎన్నికలకు నెలరోజుల సమయం ఉందనగా.. ఓట్ల కోసం.. అసలు పనులే పూర్తిగానీ ఎయిర్ పోర్టును ప్రారంభించారని జగన్ విమర్శించారు.

ఎయిర్ పోర్టుకు భారత దేశపు తొలి తంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్వతంత్ర్య పోరాటాన్ని సీఎం గుర్తు చేశారు. మన దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. 1915లో మహాత్మాగాంధీ ఇండియాకు తిరిగొచ్చి 1917లో సత్యాగ్రహం ప్రారభించారన్నారు. వీటన్నింటికంటే ముందు కర్నూలు గడ్డమీద మొదటి స్వాతంత్ర్య పోరాటం ప్రారంభమైందని గుర్తు చేశారు. 1957లో జరిగిన సిపాయిల తిరుగుబాటు కంటే ముందే 1847లోనే మహా స్వాతంత్ర్య సమరయోధుడు.. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఈ గడ్డ నుంచే వచ్చాడు. ఆయనను గౌరవిస్తూ, నివాళులర్పిస్తూ కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నామని ప్రకటించారు.

కర్నూలుకు 18కిలో మీటర్ల దూరంలోని ఓర్వకల్లులో 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విమానాశ్రయం ఏర్పాటుకు సంకల్పించింది. వెయ్యి ఎకరాల్లో నిర్మించిన ఎయిర్ పోర్టుకు 2016లో కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఆ తర్వాత మూడేళల్లో టెర్మినల్ నిర్మాణం పూర్తైంది. కానీ ఎయిరో డ్రోమ్ అనుమతులు మాత్రం రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క 2020లోనే 150 కోట్లు ఖర్చు చేసి రన్ వే, ఇతర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసింది.

ఎయిర్ పోర్టుని ప్రారంభించిన సీఎం జగన్.. కర్నూలు జిల్లా చరిత్రలో ఇది గొప్పరోజు అని అన్నారు. కర్నూలు ఎయిర్‌పోర్ట్‌లో ఒకేసారి 4 విమానాలు పార్క్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. మార్చి 28 నుంచి కర్నూలు విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఉడాన్‌ పథకంలో భాగంగా ఇండిగో సంస్థ సర్వీసెస్ నడపనుంది. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నైకు రెండేళ్ల పాటు ఇండిగో సంస్థ విమాన సర్వీసులు నడపనుంది.

ట్రెండింగ్ వార్తలు